
ఎన్నికల సహాయక కేంద్రం ఏర్పాటు
సంగారెడ్డి/సంగారెడ్డి జోన్: సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సంగారెడ్డి జిల్లా జెడ్పీ కార్యాలయ భవన సముదాయంలో ప్రత్యేక సహాయక కేంద్రం (హెల్ప్‌లైన్) ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో నామినేషన్లు, వాటి పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్, ఇతర ఎన్నికల సంబంధిత విషయాలపై సమాచారం, ఫిర్యాదులు, దరఖాస్తుల స్వీకరణకు ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను హెల్ప్ లైన్ నంబర్ 81253 52721కు ఫోన్ చేసి కూడా చెప్పవచ్చని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
ప్రజావాణి రద్దు
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.
కలెక్టర్ ప్రావీణ్య