పరిహారం పరిహాసమేనా!
హత్నూర (సంగారెడ్డి): మంజీరా నది ఉధృతితో పంటలు నీట మునిగిన నేపథ్యంలో వాటిని పరిశీలించేందుకు అధికారులు ఎప్పుడొస్తారోనని సదరు రైతులు ఎదురుచూస్తున్నారు. హత్నూర మండలంలోని రెడ్డి ఖానాపూర్, కాసాల, హత్నూర, నవాబుపేట, పన్యాల, కొన్యాల చిక్‌ద్దూర్, లింగాపూర్ ,సిరిపుర, గ్రామ శివారుల గుండా వెళ్తున్న మంజీరా నదికి భారీగా వరద రావడంతో ఆయా ప్రాంతాల్లో పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంతజరిగినా కనీసం వ్యవసాయ అధికారులెవరూ క్షేత్రస్థాయి పర్యటనకు రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం దెబ్బతిన్న పంటలను పరిశీలించే పరిస్థితిలో వ్యవసాయ శాఖ అధికారులు లేకపోవడం శోచనీయమన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పంట నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం ప్రభుత్వం మంజూరు చేసి ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించని అధికారులు
ఆందోళనలో రైతన్నలు


