
పండగపూట విషాదం
పాపన్నపేట(మెదక్): పండగ పూట విషాదం నెలకొంది. చేపల వేటకు వెళ్లిన గిరిజన యువకుడు నీట మునిగి చనిపోయాడు. ఈ ఘటన పాపన్నపేట మండలం అమ్రియా తండాలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. తండాకు చెందిన లునావత్ చందర్(36) వ్వయసాయంతో పాటు, కూలీ పనులు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. చేపలు పట్టేందుకు గురువారం ఉదయం పాత లింగాయపల్లి శివారులోని పెద్ద చెరువుకు వెళ్లి వల వేసి వచ్చాడు. తిరిగి సాయంత్రం వెళ్లి వల తీసే యత్నంలో నీట మునిగి పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, రాత్రి వెతికినప్పటికీ ఆచూకి దొరక లేదు. శుక్రవారం ఉదయం చందర్ శవం లభించింది. భార్య బుజ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తల్లి కళ్లెదుటే మునిగిన కొడుకు
చిలప్‌చెడ్(నర్సాపూర్): పూజ సామగ్రి నిమజ్జనం చేసే క్రమంలో చెరువులో పడి తల్లి కళ్లెదుటే ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన చిలప్‌చెడ్ మండలం ఫైజాబాద్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ నర్సింహులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి బాలేష్ (34) దేవీ నవరాత్రి ఉత్సవాలలో నిర్వహించిన పూజ సామగ్రిని గ్రామశివారులోని బొల్లెం కుంట చెరువులో నిమజ్జనం చేసేందుకు, తల్లి బాలమణితో కలిసి వెళ్లాడు. పూజ సామగ్రిని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బాలేష్ చెరువులో పడిపోయాడు. ఈత రాని కొడుకు నీటిలో మునిగిపోవడం గమనించిన తల్లి బాలమణి వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చే సరికి, బాలేష్ అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య విమల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
విందులో పాల్గొని వస్తుండగా..
హుస్నాబాద్‌రూరల్: స్నేహితుడు ఇచ్చిన విందులో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పూల్‌నాయక్ తండాకు చెందిన అజయ్ స్నేహితుడు శ్రీకాంత్‌కు గ్రూప్–1లో డీఎస్పీ ఉద్యోగం వచ్చింది. దీంతో శ్రీకాంత్ స్నేహితులందరికీ విందు ఏర్పాటు చేశాడు. పూల్‌నాయక్ తండాకు వెళ్లిన అజయ్ విందు అనంతరం రాత్రి పోతారం(ఎస్)కు తిరిగి వచ్చే క్రమంలో సబ్‌స్టేషన్ వద్ద బైక్ చెట్టుకు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు రోడ్డు కింద బైక్ లైట్స్‌ను గమనించి.. అక్కడ ఒకరు పడిపోయి ఉండటంతో 108కు సమాచారం అందించారు. ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అప్పటికే అజయ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొర్కొన్నారు.
విద్యుత్ ప్రమాదంలో ఆపరేటర్ మృతి
కంగ్టి(నారాయణఖేడ్): విద్యుత్ ప్రమాదంలో ఆపరేటర్ మృతి చెందాడు. ఈ సంఘటన తడ్కల్ గ్రామంలో విషాదం చోటుచేసుకొంది. నాలుగేళ్లుగా తడ్కల్ విద్యుత్ ఉప కేంద్రంలో ఆపరేటర్‌గా అశోక్‌గౌడ్ విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉప కేంధ్రం పరిధిలోని ముర్కుంజాల్ శివారులో విద్యుత్ అంతరాయం సరిచేసేందుకు వెళ్లాడు. కాగా ఆ గ్రామ శివారులో జమ్గి ఫీడర్‌తో విద్యుత్ సరఫరా ఉండగా పొరపాటుగా తడ్కల్ ఫీడర్ ఆఫ్ చేసి ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లగా దురదృష్టవశాత్తు చేతికి విద్యుత్ షాక్ తగిలి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
పాముకాటుతో గొర్రెల కాపరి మృతి
దుబ్బాక: దసరా పండుగ సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో విధి విషాదం నింపింది. తన మేకలు, గొర్రెలను మేతకు తీసుకెళ్లిన కాపరి పాముకాటుతో మరణించిన విషాదకర సంఘటన దుబ్బాక పట్టణంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొప్పుల రాజు(35) తన కులవృత్తి గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే మేకలు, గొర్రెలను మేత కోసం తీసుకెళ్లాడు. పట్టణంలోని గాంధీ విగ్రహం సమీపంలో కూలిన ఇంటి స్థలంలో జీవాలను మేపుతుండగా గడ్డిపొదల్లో ఉన్న నాగుపాము రాజును ఒక్కసారిగా కాటువేసింది. భయంతో రాజు పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు గమనించి వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే రాజు మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
విషాదం నింపిన ఈత సరదా
బావిలో మునిగి ఒకరు మృతి
అల్లాదుర్గం(మెదక్): దసరా పండగ పూట విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి బావిలో మునిగి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన అల్లాదుర్గం మండలం మాందాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్ కథనం ప్రకారం.. చిల్వర్ గ్రామానికి చెందిన మాడబోయిన యాదయ్య (41) జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. పండుగకు కుటుంబ సభ్యులతో ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం అన్నదమ్ముల పిల్లలతో కలిసి సరదాగా మాందాపూర్ గ్రామ శివారులోని చెన్న బోయిన కుంట బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ యాదయ్య నీట మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

పండగపూట విషాదం

పండగపూట విషాదం

పండగపూట విషాదం

పండగపూట విషాదం