
మహాత్మా మన్నించు..!
జయంతి రోజునేగాంధీ విగ్రహం ధ్వంసం పోలీసుల అదుపులో10 మంది నిందితులు!
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని యశ్వంతరావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వైపు గురువారం జాతిపిత మహాత్ముడి జయంతి వేడుకలు నిర్వహిస్తుంటే.. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆయన విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. మహాత్ముడి జయంతి రోజున విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామానికి చెందిన పలువురు యువకుల ప్రమేయం ఉందని గుర్తించి వారిని పోలీస్‌స్టేషన్ తరలించి విచారించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నూతన గాంధీ విగ్రహాన్ని తెప్పించి ధ్వంసం చేసిన చోటే ప్రతిష్ఠించి జయంతి వేడుకలను నిర్వహించారు. కాగా, ఈ ఘటనలో పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.
విగ్రహ ధ్వంసంలో
జాతీయ పార్టీ నాయకుల ప్రమేయం
యశ్వంతరావుపేటలో మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో గ్రామానికి చెందిన పలువురు యువకులు ఓ జాతీయ పార్టీకి చెందినవారు అని తెలిసింది. గురువారం తెల్లవారుజామున వారంతా కలసికట్టుగా విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఉండటం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఏదేమైనా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.