
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
● డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం ● చిన్నారి మృతి..
గజ్వేల్‌రూరల్: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని వస్తున్న ఓ కుటుంబంలో రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆరేళ్ల చిన్నారి కళ్ల ముందే తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లికి చెందిన బాసాడి నరేష్‌రెడ్డి–వైష్ణవిలకు కూతురు రిశ్విత(6), కొడుకు ఎశ్విత్‌రెడ్డి సంతానం. నరేష్‌రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఓ పరిశ్రమలో కార్మికునిగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దసరా పర్వదినం కావడంతో నరేష్‌రెడ్డి తన ద్విచక్ర వాహనంపై శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి చేగుంట మండలం కరణంపల్లిలోని ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లారు. దైవదర్శనం ముగించుకొని తిరిగి సంగుపల్లికి వస్తున్న క్రమంలో ధర్మారెడ్డిపల్లి శివారులోని రింగురోడ్డు దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో రిశ్విత తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో నరేష్‌రెడ్డికి కాలు, వైష్ణవి చేతులకు తీవ్ర గాయాలవగా, ఎశ్విత్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అప్పటి వరకు ఆనందంగా ఉండి దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో రిశ్విత మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. కళ్ల ముందే ఆరేళ్ల కన్నకూతురు రిశ్విత మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..