
కత్తులతో బెదిరించి.. డబ్బులు వసూలు
● దాడులకు పాల్పడుతున్నముగ్గురు అరెస్టు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ పరితోశ్
సంగారెడ్డి జోన్: జల్సాలకు అలవాటు పడి కత్తులతో బెదిరించి, దాడులు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన విజయ్ సింగ్, ఈశ్వర్ సింగ్‌తో పాటు మరో బాలుడు వెల్డింగ్ దుకాణంలో పనులు చేస్తున్నాడు. వీరంతా చెడు అలవాట్లకు బానిసయ్యారు. వచ్చిన సంపాదన సరిపోకపోవడంతో తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. పట్టణ శివారులోని హైవే రోడ్ల పక్కన నిర్మానుష్య ప్రదేశంలో ఏదైనా దోపిడీ, దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. గత నెల 29న ముగ్గురు కలిసి నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలనే టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. అర్ధరాత్రి 12:30 సమయంలో పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై లారీ వద్దకు వెళ్లి డ్రైవర్, క్లీనర్లను కత్తితో బెదిరించి రూ.25 వేలు, ఒక సెల్‌ఫోన్, అదే రోజు 01:40 సమయంలో కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలో డ్రైవర్‌ను డబ్బులు ఇవ్వమని బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి పారిపోయారు. అక్కడి నుంచి వెళ్లి 02:15 సమయంలో ప్యాలస్ హోటల్ సమీపంలో కత్తితో బెదిరించి రూ.5 వేలు, ఒక సెల్‌ఫోన్ తీసుకొని పరారయ్యారు. పటాన్ చెరు, కొండాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఘటన జరిగిన 48 గంటల సమయంలోనే దాడులకు పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దొంగిలించిన రూ.18,800, బైక్, కత్తి, సెల్‌ఫోన్ స్వాధీన పరుచుకున్నారు. వీరందరూ గతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. కాగా, ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని రిమాండ్‌కు తరలించగా.. మరో నిందితుడు బాలుడు కావడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు.