
రసాయన శాస్త్రంలో శశికళకు పీహెచ్‌డీ
పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని చీమల పాటి వీఏ శశికళ డాక్టరేట్‌కు అర్హత సాధించారు. ‘ఎస్జీఎల్టీ– 2 నిరోధకం అయిన కెనాగ్లిప్లోజిన్, యాంటీ–ఆండ్రోజెన్ అయిన అబిరాటెరోన్ అసిటేట్, వాటి సంబంధిత పదార్థాల సమర్థవంతమైన సంశ్లేషణ’పై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైనన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అన్నా ప్రగడ రత్నమాల శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ శశికళ అధ్యయనంలో గ్లిప్లోజిన్ కెమిస్ట్రీ, అబిరాటెరోన్ అసిటేట్ ముఖ్యంశాలుగా తెలియజేశారు. మొదటి పద్ధతిలో 17 గ్లిప్లోజిన్ ఉత్పన్నాల కోసం సింథటిక్ వ్యూహాల సమగ్ర సమీక్ష, ఇందులో కెనాగ్లి ప్లోజిన్ సంశ్లేషణ కోసం ఒక వినూత్నమైన, సమర్థవంతమైన పద్ధతి అభివృద్ధి, ఔషధ ఆవిష్కరణలో ఆచరణాత్మక పద్ధతులను మెరుగు పరుస్తుందని వివరించారు. ఇక అబిరాటెరోన్ అసిటేట్ అధ్యయనంలో, అధునాతన 2డీ, 3డీ స్పెక్ట్రల్ పద్ధతులను ఉపయోగించి ఎనిమిది యూఎస్పీ జాబితాతో ఏపీఐ సంబంధిత మలినాలకు చెల్లు బాటయ్యే ఫ్రేమ్ వర్క్ తో పాటు, భారీ సంశ్లేషణకు పర్యావరణ అనుకూల, ఖర్చు–సమర్థవంతమైన, నాణ్యత ఆధారిత విధానం రూపొందించినట్టు తెలిపారు. ఈ పరిశోధనలు ఔషధ సంశ్లేషణలో స్థిరమైన, ఖచ్చితమైన, వినూత్న విధానాల యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు ఇతర విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు డాక్టర్ వీఏ శశికళను అభినందించారు.