
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ బాక్సులు సిద్ధం చేస్తున్న అధికారులు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న ఉద్యోగులు 1,458 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు 7,44,157మంది ఓటర్లు
నారాయణఖేడ్: ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎన్నికల నిర్వహణకు ఏయే స్థాయి అధికారులు అవసరమో ఇదివరకే గుర్తించి శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ అధికారులకు వారి సొంత మండలాల్లో గత నెల 27, 29వ తేదీల్లో మొదటి విడత శిక్షణ ఇచ్చారు. రిటర్నింగ్ అధికారులకు నోటిఫికేషన్ నుంచి నామినేషన్లు స్వీకరించడం, పరిశీలించడం, ఆమోదించడం, పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం తదితర అంశాలపై ఏడురోజులకు సంబంధించి శిక్షణ అందించారు. ఈ విషయాల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సహయకారులుగా వ్యవహరించేలా శిక్షణ ఇచ్చారు.
20% అదనంగా బ్యాలెట్ బాక్సులు
ప్రాదేశిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన నిర్వహిస్తుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జెడ్పీటీసీ ఎన్నికలకు తెలుపురంగు, ఎంపీటీసీ ఎన్నికలకు గులాబీరంగు బ్యాలెట్ పత్రాలను అదించనున్నారు. మొత్తం 1,458 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ బాక్సులను సైతం అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. మరో 20శాతం బ్యాలెట్ బాక్సులను అదనంగా అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలోని ఆయా మండల కేంద్రాలకు బ్యాలెట్ బాక్సుల తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. స్థానిక ఎన్నికల్లో 7,44,157మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.