మిరుదొడ్డి(దుబ్బాక): స్థానిక సంస్థల్లో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్ సాధనకు కృషి చేసిన ఘనత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకే దక్కుతుందని డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. బుధవారం అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైర్మన్ ప్రత్యేక చొరవ తీసుకుని రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు అందించారని తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు అమలు చేసి కాంగ్రెస్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దుబ్బరాజం, జెన్నారెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.