
మద్యం మత్తులో ఘర్షణ..
ఒకరు మృతి
అల్లాదుర్గం(మెదక్): మద్యం మత్తులో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగి ఒకరు మృతి చెందారు. గ్రామస్తులు, అల్లాదుర్గం ఎస్‌ఐ శంకర్ కథనం ప్రకారం... పుల్కల్ మండలంలోని పోచారం గ్రామానికి చెందిన నాగారపు లక్ష్మణ్ (38) 11 సంవత్సరాల క్రితం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్వరిని వివాహం చేసుకొని ఇల్లరికం వచ్చాడు. అయితే మద్యానికి బానిసైన అతడు కొంత కాలంగా భార్యతో దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం లక్ష్మణ్ గ్రామానికి వచ్చి ఇదే గ్రామానికి చెందిన పుట్టి అంజయ్యతో కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో మాటామాట పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో లక్ష్మణ్’పై అంజయ్య విచక్షణ రహితంగా దాడిచేసి గాయపర్చాడు. వెంటనే అంబులెన్స్‌లో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.