
పత్తికి గులాబీ గుబులు
● ముందస్తు జాగ్రత్తలతో పురుగుకు చెక్
● సస్యరక్షణ చర్యలతో పంటను కాపాడుకోవాలి
● శాస్త్రవేత్త ఎన్.స్నేహలత సూచనలు
జహీరాబాద్: భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఉన్న వాటిని కాపాడుకునేందుకు రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీడీఎస్–కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త ఎన్.స్నేహలత తెలిపారు. ముఖ్యంగా గులాబీ పురుగు బారి నుంచి పత్తిని కాపాడుకోవాలని సూచించారు. ఈ సమయంలో గులాబీ పురుగు, రసం పీల్చే పురుగు, కాయకుళ్లు తెగుళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కాయ గట్టిపడి ఎదిగే దశలో ఉందని, రైతులు పురుగు ఉనికిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపడితే పత్తిలో దిగుబడులు సాధించవచ్చని ఆమె పలు సూచనలు చేశారు.
నష్టపరిచే లక్షణాలు
గులాబీ పురుగు బారిన పడిన పంట పూత దశలో ఉన్నప్పుడు దాంట్లో విచ్చుకోకుండా ఉన్న పువ్వులను విప్పి చూస్తే పిల్ల పురుగు గమనించవచ్చు. వీటినే గుడ్డి పువ్వులు అంటారు. పత్తి కాయలు పగలాల్సిన సమయం కంటే ముందుగానే పగిలి ఎండిపోతాయి.
యాజమాన్య పద్ధతులు
ముందుగా ఈ పురుగు కోశస్థ దశలు కోసి విడిచిపెట్టిన పంట లేదా భూమిలో అలాగే ఉంటాయి. పంటను వేయడానికి ముందు ఏప్రిల్, మేలో దుక్కులను లోతుగా దున్నడం వల్ల అవి సూర్యరశ్మికి ఆకర్శితం అవడం, పక్షులు తినడం వల్ల కొంత వరకు పంటను కాపాడుకోవచ్చు. పంటను వేసుకునే సమయంలో అంతర పంటగా ప్రతి ఏడు సాళ్లకు మధ్య ఒక కంది సాలు వేసుకోవాలి. 45 రోజుల తర్వాత లింగాకర్షక బుట్టలు 4 నుంచి 8 అమర్చుకున్నట్లయితే పురుగు ఉధృతిని గమనించవచ్చు. పూత సమయంలో గుడ్డి పువ్వులు, వాటిలో పిల్ల పురుగులను గమనిస్తే తీసి దూరంగా పారవేయాలి. 45 రోజులకు ముందుగా అజాడిరాక్టింగ్ 1500 పీపీఎం మందును 5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ పురుగు గుడ్ల సంఖ్యను కొంత వరకు తగ్గించుకోవచ్చు. ముందుగానే తయోడికార్బ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం పుడుతున్న వర్షాల వల్ల రైతులు మొదటి కాత కంటే రెండో కాతపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. రెండో కాతకు మొదట్లోనే గులాబీ పురుగు ఉధృతి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక దీనికి క్లోరన్ట్రా నిలిప్రోల్ మరియు లేమ్డా నైహాలోత్రిన్‌ని కలిపి ఉన్న మందు 0.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది.
గులాబీ పురుగు జీవన చక్రం
ఈ పురుగు 25 నుంచి 30 రోజుల్లో పూర్తవుతుందని శాస్త్రవేత్త స్నేహలత పేర్కొన్నారు. రెక్కల పురుగు లేత ఆకుల అడుగు భాగాన, ఆకుల అంచున లేదా లేత పువ్వులు, కాయలపై 250కి పైగా గుడ్ల పెడుతుంది. వీటి నుంచి పొదిగిన పిల్ల పురుగులు పువ్వుల్లోని ఖనిజాలను తినేయడం గమచించవచ్చు. అలాగే కాయలపై పొదిగిన పిల్ల పురుగులు లోపలికి చొచ్చకుపోయి అందులో ఉన్న విత్తనాన్ని తిని విసర్జించడం వల్ల పత్తి మరియు నూనె నాణ్యత తగ్గడం, ఎదగక రాలిపోవడం జరుగుతుంది.

పత్తికి గులాబీ గుబులు

పత్తికి గులాబీ గుబులు