
ఘనంగా ‘తీజ్’ ఉత్సవాలు
చిలప్‌చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని బద్య్రా తండాలో బుధవారం తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తండా పెద్దలు మాట్లాడుతూ బంజారాల కుల దేవత, మమాత అని, మాతకు నిర్వహించే నవరాత్రుల పండగను తీజ్ అంటామని తెలిపారు. నవరాత్రులలో భాగంగా అమ్మవారి ఎదుట నవధాన్యాలతో ఏర్పాటు చేసిన తొమ్మిది బుట్టలలో, తండాకు చెందిన పెళ్లి కాని అమ్మాయిల చేత ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నవధాన్యాల బుట్టల్లో నీళ్లు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారన్నారు. నవరాత్రులు పూర్తవడంతో నవధాన్యాల బుట్టలను చెరువులో నిమజ్జనం చేసి, బంజారాల సంప్రదాయ ఆట, పాటలతో వేడుకగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడావత్ రేక్యా, మెగావత్ దుర్గ్యానాయక్, తుల్జ్యా, పర్ష్యా, కున్యానాయక్, మహిళలు, చిన్నారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.