
మహాత్మా.. మన్నించు
● గజ్వేల్‌లో శిథిలావస్థలో విగ్రహం
● పట్టించుకోని పాలకులు, నాయకులు
గజ్వేల్‌రూరల్: దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కీలకపాత్రను పోషించిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని అక్టోబర్ 2న జరుపుకోవడం అందరికి తెలిసిందే. ఆ రోజున ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు కలిసి మహాత్మాగాంధీ విగ్రహాలు ఎక్కడున్నా వాటిని అందంగా ముస్తాబు చేసి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గజ్వేల్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని అందరూ మరిచిపోయారు. పగిలిన కళ్లజోడు, విరిగిన చెయ్యి, కర్ర, వెలిసిపోయిన రంగుతో దర్శనమిస్తుంది. నూతన మున్సిపల్ భవనం నిర్మించిన తర్వాత పాత కార్యాలయం వద్ద ఉన్న విగ్రహాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. పట్టణంలోని అంగడిపేట హనుమాన్ దేవాలయం, నూతన మున్సిపల్ కార్యాలయం, కోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహాలను ముస్తాబు చేశారు. ఈ విధంగానే పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న విగ్రహాన్ని తీర్చిదిద్దాలని, లేనిపక్షంలో అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.