స్థానిక పోరుకు సన్నద్ధం!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయపార్టీలు పావులు మోహరిస్తున్నాయి.ఈ ఎన్నికల్లో ఎలాగైన సత్తా చాటేందుకు ముందుకెళ్తున్నాయి. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నాల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే జిల్లాలో తన పట్టు నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ముందుకెళుతోంది.
బీఆర్‌ఎస్‌లో నెలకొన్న పోటాపోటీ
ఆయా స్థానాలకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నాయకుల జాబితాలను బీఆర్‌ఎస్ సిద్ధం చేస్తోంది. ప్రధానంగా జెడ్పీటీసీ టికెట్‌ల కోసం బీఆర్‌ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. రిజర్వేషన్ అనుకూలించిన నాయకులు పలువురు ఈ టికెట్‌ను ఆశిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని మండలాల ఆశావహుల పేర్లను రాసుకుంటున్నారు. దసరా తర్వాత సంబంధిత నాయకులతో మాట్లాడి అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహిస్తున్నారు.
యువతపై దృష్టిపెట్టిన బీజేపీ
పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీద ఉన్న బీజేపీ..ఈ ఎన్నికల్లోనూ తమ హవాను కొనసాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే మంగళవారం ఆపార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహాక సమావేశం నిర్వహించింది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ముఖ్యనాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీకి గ్రామాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడింది. ప్రధానంగా యువత కమలం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని అనుకూలంగా మార్చుకుని స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు కార్యాచరణను ప్రారంభించింది.
సందడిగా మారిన కాంగ్రెస్ నేతల ఇళ్లు
హస్తం పార్టీ కూడా స్థానిక సమరానికి సిద్ధమైంది. టికెట్లు ఆశిస్తున్న నాయకులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిల వద్దకు క్యూ కడుతున్నారు. టికెట్ల కోసం వచ్చిన వారితో వీరి నివాసాలు సందడిగా మారుతున్నాయి. ఇప్పటికే ఒకటీ, రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను నియోజకవర్గ ఇన్‌చార్జిలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. దసరా తర్వాత అన్ని పార్టీలు ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యేల వద్ద కాంగ్రెస్ ఆశావహులు
ఆశావహుల జాబితా
సిద్ధం చేస్తున్న బీఆర్‌ఎస్
సన్నాహాక సమావేశం నిర్వహించిన బీజేపీ
దసరా తర్వాత
ప్రత్యక్ష కార్యాచరణకు ప్రధాన పార్టీలు


