
పంటలను ముంచెత్తిన సింగూరు
● ఆందోళనలో రైతులు
● పరిహారం ఇచ్చి అదుకోవాలి
మునిపల్లి(అందోల్): ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా సింగూర్ ప్రాజెక్టు ఎగువ, దిగువన పత్తి, చెరుకు పంటలు పూర్తిగా నీట మునిగాయి. జిల్లాలోని మానూర్ మండలం ఉక్రాన్ గ్రామం సింగూర్ ప్రాజెక్టు ఎగువన ఉండటంతో నీరు నిలిచి లోతట్టు ప్రాంతాల్లోని పత్తి పంట, చెరుకు పంట మునిగి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సింగూర్ ప్రాజెక్టు 11 గేట్లను అధికారులు ఎత్తడంతో సమీపంలో ఉన్న ఏటిగడ్డ సంగ్యం, మాలపాడు, సింగూర్ గ్రామంతోపాటు లోతట్టు ప్రాంతాల భూములలో ఉన్న పంటలలో నీరు నిలిచి పంటలు పనికి రాకుండా పోయాయి. కాగా, జిల్లాలో 3,16,176 ఎకరాల్లో పత్తి, 8,973 ఎకరాల్లో చెరుకు పంటలను సాగు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారులు స్పందించి పంట నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
సింగూర్ ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూముల్లో నీరు నిలిచి పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అధికారులు పంట నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలి.
– జి. నర్సింహ్మరెడ్డి ,ఉక్రాన గ్రామం
వివరాలు సేకరిస్తున్నాం
పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నాం. గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. త్వరలోనే నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తాం.
– శివప్రసాద్ ,జిల్లా వ్యవసాయాధికారి

పంటలను ముంచెత్తిన సింగూరు

పంటలను ముంచెత్తిన సింగూరు

పంటలను ముంచెత్తిన సింగూరు