అమల్లోకి ఎన్నికల కోడ్
నారాయణఖేడ్: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇది కొనసాగనుంది. కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై ఆంక్షలు కొనసాగనున్నాయి. ఎన్నికల కోడ్ సెప్టెంబర్ 29న సోమవారం నుంచి జిల్లాలో అమల్లోకి వచ్చింది. దీంతో కోడ్ ముగిసే వరకు సామాన్య వ్యక్తి రూ.50 వేల వరకు మాత్రమే నగదును తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా, సరైన పత్రాలు లేకపోయినా నగదును అధికారులు సీజ్ చేయనున్నారు. ఎక్కువ మొత్తంలో నగదు లభిస్తే ఎన్నికల అధికారులు ఐటీ, జీఎస్‌టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. అత్యవసర వైద్యం, వ్యాపారాలు, కళాశాలల ఫీజులు, వివాహాలు వంటి వాటికి పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లేవారు తప్పనిసరిగా సరైన ఆధారాలను వెంట ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సరైన పత్రాలను చూపించగలిగితేనే జప్తుచేసిన డబ్బును తిరిగి ఇస్తారు. నగదు రవాణపై పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు.
ముగ్గురు పిల్లల నిబంధనతో నిరుత్సాహం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్ల నిబంధనలు ఎత్తేస్తారన్న ప్రచారం ప్రచారంగానే మిగిలిపోయింది. 2018 పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకు రాకపోవడంతో ఈ నిబంధన అమలులో ఉండనుంది. ముగ్గురు పిల్లలున్న వారు పోటీకి అనర్హులు. దీంతో చాలామంది ఆశావహుల్లో ఈ నిబంధన నిరుత్సాహాన్ని నింపింది. దేశంలో జనాభా పెరుగుదలను నిరోధించేందుకు 1994లో నాటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా ఇద్దరు పిల్లల నిబంధన అమలులోకి తీసుకొచ్చారు. 1994 తర్వాత మూడో సంతానం కలిగితే వారు పోటీ చేసేందుకు అనర్హులు. పాతన నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నారు.
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే: కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ ఎన్నికల కోడ్ విషయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులకు ఏవైనా సందేహాలుంటే అధికారులతో సమగ్రంగా నివృతి చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పీ సీఈఓ జానకీరెడ్డి, డీపీఓ సాయిబాబా, జిల్లా బీసీ సంక్షేమాధికారి జగదీశ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
రూ.50 వేలు మించి తీసుకెళ్తే సీజ్
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆంక్షలు
ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత


