ఆస్తి తగాదా.. తమ్ముడిని చంపిన అన్న
సంగారెడ్డి జిల్లాలో ఘటన
జహీరాబాద్: ఆస్తి పంపకాల గొడవలతో తమ్ముడిని అన్న చంపాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున కోహీర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చింతలగట్టు గ్రామంలోని సొంత ఇంట్లో జయరాం ఒక్కడే నివాసం ఉంటున్నాడు. పెద్దన్న జయంత్ లింగంపల్లి గ్రామంలో నివాసం ఉంటుండగా, రెండో అన్న జైపాల్ గ్రామంలోని కమ్యూనిటీ భవనంలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం చుట్టుపక్కల వారు జయరాం ఇంటి తలుపు తీయకపోవడంతో గమనించి జయంత్‌కు సమాచారం అందించారు. అతడు ఇంటికి వచ్చి చూడగా చిన్న తమ్ముడు జయరాం ఇంట్లో రక్తపు మడుగులో మరణించి ఉన్నాడు. ఇటీవల తండ్రి మొల్లయ్య ఆగస్టు 1న మరణించాడు. అప్పటి నుంచి జైపాల్ తన అన్న జయంత్, తమ్ముడు జయరాంతో తరచూ గొడవపడుతూ వస్తున్నాడు. ఉన్న రెండెకరాల పొలం, ఇంటిని తనకే ఇవ్వాలని, లేనిచో ఇద్దరినీ చంపేస్తానని బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ విషయమై పలుమార్లు గొడవ కూడా జరిగింది. ఈ క్రమంలో ఆదివారం సైతం జైపాల్ తన తమ్ముడు జయరాంతో గొడవపడ్డాడు. దీంతో అతడు అన్న జయంత్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించాడు. వెంటనే డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు సైతం వెళ్లారు. అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండాలని సర్దిచెప్పి వెళ్లారు. రాత్రి ఒంటరిగా నిద్రిస్తున్న జయరాంపై బలమైన ఆయుధంతో తలపై మోదడంతోనే మరణించి ఉంటాడని మృతుడి అన్న జయంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ప్రస్తుతం జైపాల్ పరారీలో ఉన్నాడు.


