
స్థానిక కోడ్ కూసింది
● ఎన్నికల షెడ్యూల్ విడుదల ● పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు ● పోటీకి సిద్ధమవుతున్న రిజర్వేషన్లు కలిసొచ్చిన నేతలు ● ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిల వద్దకు పరుగులు ● మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఆశావహులు ● అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించనున్న ప్రధాన పార్టీలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ రావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతుండగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో బరిలోకి దిగాలని భావిస్తున్న నేతలు ఈ టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పార్టీ కీలక నేతల వద్దకు వెళ్లి టికెట్ కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి చూపుతున్న నాయకులు దసరా పండుగల సందర్భంగా విందులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి నుంచే గ్రామాల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.
రెండు విడతల్లో...
సర్పంచులతోపాటు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో వీటికి ఎన్నికల నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను రెండు విడతల్లో చేపట్టాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ప్రకటించారు. అలాగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో..
ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదల చేయనున్నారు. ఆరోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కోర్టు తీర్పు ఈ నెల 8న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు మేరకు ఎన్నికలు నిర్వహణ ముందుకు సాగే అవకాశాలున్నాయి. దీంతో పోటీ చేయాలని భావించిన నాయకులు సంశయంలో ఉన్నారు. తీరా ఒకవేళ ఎన్నికలు వాయిదా పడితే ఇప్పటి నుంచి పెట్టిన వ్యయం వృథా అవుతుందేమోననే ధోరణితో నాయకులు ఉన్నారు.
అమలులోకి ఎన్నికల కోడ్..
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు వీలు ఉండదు. అలాగే రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎన్నికల నియమావళిని పాటించాలని ఎన్నికల సంఘం ప్రకటించింది.
అభ్యర్థుల ఎంపికపై పార్టీల నజర్
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించనున్నాయి. తొలుత జెడ్పీటీసీ అభ్యర్థులు, ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీల ఇన్‌చార్జిలు కీలకంగా వ్యవహరించనున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే సోమవారం సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2న దసరా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు పండగల బిజీల్లో ఉన్నారు. ఈ పండగల తర్వాత ఈ ఎన్నికల వేడి మరింత రాజుకోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాపతినిధుల స్థానాలివి
మొత్తం సర్పంచుల స్థానాలు (గ్రామపంచాయతీలు): 613
మొత్తం వార్డు సభ్యుల సంఖ్య: 5,370
మొత్తం మండలాలు (జెడ్పీటీసీల సంఖ్య): 25
ఎంపీటీసీల సంఖ్య: 261
ఎంపీపీలు: 25