కూరగాయాలు
● వర్షాలకు దెబ్బతిన్న పంటలు ● వెంటాడుతున్న తెగుళ్ల బెడద ● వరుసగా నష్టాలు..ఆందోళనలో రైతులు
జహీరాబాద్ టౌన్: కొంత కాలంగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం కూరగాయ పంటలపై తీవ్రంగా పడింది. వానలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట పొలాల్లో నీరు నిలువ ఉండటంతో కూరగాయలు రాలిపోవడం, ఆకుకూరలు తడిసి మురిగిపోయాయి. తాజాగా కురుస్తున్న వాన వల్ల పంటలకు తెగుళ్లు వెంటాడుతుంది. ఏ పంటలకు ఏ మందులు వేయాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎనిమిది వేల ఎకరాలకు పైగా సాగు..
ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో సాగునీటి కొరత వల్ల కూరగాయల సాగు ఆలస్యంగా మొదలైంది. కొంతమంది రైతులు జూన్, జూలై నెలల్లోనే పంటలు వేశారు. జిల్లాలో సుమారు 8 వేల ఎకరాలకు పైగా కూరగాయ పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో భారీ ఎత్తున వానలు కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. వారం రోజుల నుంచి ముసురుతో నేలలు బురదగా మారడం వల్ల రైతులు తోటల వద్దకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. టమాటా,బెండ,బీర,దొండ, వంకాయ వంటి వాటిని కోయడం, మోసుకురావడం, వాటిని మార్కెట్‌కు తరలించడం ఇబ్బందిగా మారింది. అత్యధిక వినియోగం ఉండే టమాటాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే కూరగాయల రకాన్ని బట్టి రైతులు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. వర్షాల వల్ల వివిధ రకాల తెగుళ్లు సోకడంతో రైతులు సస్యరక్షణ పనులు ముమ్మరం చేశారు. సూచనలు, సలహాలు ఇచ్చే వారు లేక దెబ్బతిన్న పంటలకు ఏ మందులు వేయాలో తెలియడం లేదని వాపోతున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిన్న కారణంగా మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగాయి.
వర్షాలతో కష్ట నష్టాలు
రెండు నెలల నుంచి ఎడతెగని వర్షాలతో కూరగాయలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సగం ఎకరం బెండ తోటలో వారానికి సుమారు వంద కిలోల దిగుబడి రావాలి. ప్రస్తుతం 30 కిలోలు కూడా రావడంలేదు. మిగతా కూరగాయల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వర్షాలు ఆగితేనే ఇప్పుడున్న పంట దక్కుతుంది. ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి.
–వెంకట్,రైతు, బూచినెల్లి
కూరగాయాలు


