పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు
● సర్పంచులు 613.. వార్డు సభ్యులు 5,370 ● కొత్తగా 11 గ్రామపంచాయతీలు ఏర్పాటు ● గతంలో కంటే తగ్గిన జీపీ, వార్డులు
సంగారెడ్డి జోన్: జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 42% బీసీలకు కేటాయిస్తూ గతంలో ఉన్న రిజర్వులకు పూర్తిగా భిన్నంగా రొటేషన్ పద్ధతిలో కేటాయించారు. ఎన్నికల నిర్వహణ లో భాగంగా గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యుడి స్థానాల జాబితాను విడుదల చేశారు.
జిల్లాలో 613 జీపీలు.... 5,370 వార్డులు
జిల్లా వ్యాప్తంగా 613 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో 5,370 వార్డులున్నాయి. ఇందులో 81 గ్రామ పంచాయతీలలో 100% ఎస్టీ జనాభా ఉంది. ఆయా గ్రామ పంచాయతీలను పూర్తిగా ఎస్టీలకే రిజర్వ్ చేశారు. మరో 18 గ్రామపంచాయతీలలో ఎస్టీ జనాభా ఉండటంతో వాటిని సైతం ఎస్టీలకే కేటాయించారు.
తగ్గిన గ్రామపంచాయతీలు, వార్డులు
గత పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 647 జీపీలు ఉండగా 5,778 వార్డులకు ఎన్నిక జరిగింది. అయితే జిల్లాలో 11 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. 45 గ్రామపంచాయతీలు సమీప మునిసిపాలిటీలలో విలీనం కాగా మరికొన్ని కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఇందులో పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎక్కువ పంచాయతీలు విలీనమయ్యాయి. దీంతో గతంలో కంటే ప్రస్తుతం 34 పంచాయతీ, 408 వార్డుల స్థానాల సంఖ్య తగ్గింది.


