
కాగితపు బతుకమ్మతో ఉపాధి
రూ.350 నుంచి రూ. 1500 వరకు విక్ర యాలు
కౌడిపల్లి(నర్సాపూర్): పూలను పూజించే పండుగ బతుకమ్మ. తెలంగాణలో ఎంతో ప్రఖ్యాతి గాంచింది. కాగా నేడు బతుకమ్మలకు పూలు కరువయ్యాయి. దీంతో కాగితాల బతుకమ్మ వైపు జనం చూస్తుండగా తయారు చేసేవారికి ఉపాధి లభిస్తుంది. బతుకమ్మకు ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో గునుగు పువ్వుతోపాటు తంగేడు పూలను అధికంగా వాడుతారు. రంగురంగుల పూలతో మహిళలు బతుకమ్మను పేరుస్తారు. కాగా ఇందులో గునుగుపువ్వుది ప్రధాన పాత్ర. ప్రస్తుతం గునుగు, తంగేడు పువ్వులు లభించకపోవడంతో బంతి, ఇతర పువ్వులకు అధిక ధరలు ఉన్నాయి. దీనికితోడు పెద్ద బతుకమ్మను పువ్వులతో పేర్చడం శ్రమతో కూడుకున్న పని. దీనికి ప్రత్యామ్నాయం కాగితాల బతుకమ్మ. ఇటు పూల సమస్యకు, అటు శ్రమ సమయం ఆదా చేసుకునే వీలు ఉండటంతో జనం కాగితాల బతుకమ్మ కొనుగోలు చేస్తున్నారు.
కొన్నేళ్లుగా తయారీ
మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామానికి చెందిన మ్యాదరి దుర్గయ్య, కిష్టయ్య, శేఖులు, ఎరుకల దుర్గేశ్, శేఖర్ కుంటుంబాలకు చెందిన వ్యక్తులు కాగితాల బతుకమ్మలను కొన్నేళ్లుగా తయారు చేస్తున్నారు. పండుగ సీజన్‌లో సుమారు నెల రోజులపాటు తయారీ చేసి ఉపాధి పొందుతున్నారు. ఈత కమ్మలతో బతుకమ్మ బుట్టిని అల్లి వివిధ రంగుల కాగితాలతో అందమైన ఆకారంలో కత్తిరించి అతికించి బతుకమ్మలను తయారు చేస్తున్నారు. ఒక్కో కాగితాల బతుకమ్మకు సైజును బట్టి రూ.350 నుంచి రూ.1500వరకు అమ్ముతున్నారు.

కాగితపు బతుకమ్మతో ఉపాధి