
ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నం
ఆస్తి విషయంలో కుటుంబంతో
గొడవే కారణం
దుబ్బాకరూరల్: ఆస్తి తగాదాలతో ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని చీకోడ్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దొడ్ల అశోక్‌గౌడ్ ఆర్మీలో జవాన్‌గా పని చేస్తున్నాడు. పదేళ్ల నుంచి ఆస్తి విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి గ్రామానికి వచ్చి తన బాబాయి ఇంట్లో ఉన్నాడు. తల్లి, తమ్ముళ్లు ఇంటికి రానివ్వక పోవడంతో మనస్తాపానికి గురై ఆదివారం ఉదయం సూసైడ్ నోట్ రాసి, చనిపోతున్నానని సెల్ఫీ వీడియో తీశాడు. తన తల్లి, తమ్ముళ్లు ఆస్తి పంచడం లేదని, ఇంటికి రానివ్వడం లేదన్నాడు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామ శివారులో అతడు పడిపోయి ఉండటం చూసిన గ్రామస్తులు కుటుంబీకులకు సమాచారం అందించారు. వారి చిన్నాన్న కుమారులు అక్కడికి వెళ్లి అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా సూసైడ్ సెల్ఫీ వీడియో వాట్సప్ గ్రూప్‌లలో వైరల్‌గా మారింది. అశోక్‌గౌడ్‌కు తెలియకుండా ఇటీవల తల్లి, తమ్ముళ్లు కలిసి హైదరాబాద్‌లో ఉన్న ప్లాట్‌ను అమ్ముకున్నట్లు సమాచారం.

ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నం