
అదృశ్యమై.. బావిలో శవమై
మృతి చెందిన యువకుడు
జగదేవ్‌పూర్(గజ్వేల్): బావిలో పడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని నబీనగర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కృష్ణారెడ్డి, గ్రామస్తులు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బింగి నర్సింహులు(28) హమాలి పనితో పాటు, వ్యవసాయం చేసేవాడు. నాలుగేళ్ల క్రితం ప్రేమలో విఫలంతోపాటు పెళ్లి కుదరకపోవడంతో రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి బతికాడు. దీంతో మద్యానికి బానిసై ఇంట్లో తల్లిదండ్రులతో తరచూ గొడవకు దిగేవాడు. ఈనెల 24న గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు బంధువులు, చుట్టు ప్రక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం రాత్రి గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలాడు. రాత్రి కావడంతో ఆదివారం ఉదయం గ్రామస్తులు, పోలీసుల సహకారంతో శవాన్ని బయటకు తీశారు. మృతదేహం మొత్తం కుళ్లిపోవడంతో వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.