
తాత్కాలికంగా ప్రజావాణి రద్దు
సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దైంది. ఈ మేరకు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పనుల్లో నిమగ్నమై ఉన్నారని ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని అధికారులకు సహకరించాలని కోరారు. ప్రజవాణికి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు.
పూల పండుగ..
ధరలు నిండుగా
బతుకమ్మ పండుగ పూలకు భారీ డిమాండ్
సంగారెడ్డి క్రైమ్: మహిళలు పూలను పూజించే ఏకై క పండుగ బతుకమ్మ. పట్టణంతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాల్లో ఆదివారం బతుకమ్మను పేర్చేందుకు గునుగు, తంగేడు, బంతి, చామంతి, గడ్డి పూలను పెద్ద ఎత్తున విక్రయించారు. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో పట్టణాల్లో పండుగ సందడి నెలకొంది. బతుకమ్మ పూలకు భారీ డిమాండ్ ఏర్పడటంతో వ్యాపారులు వాటి ధరలను భారీగా పెంచేశారు. దీంతో సామాన్య ప్రజలు పూలను కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. బంతి పువ్వు కిలో రూ.150 నుంచి రూ.200 వరకు పలికింది. స్థానికంగా సాగు లేకపోవడంతో వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
ఇవి ట్రా‘ఫికర్’ బారికేడ్లు
సంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ను అదుపుచేసేందుకు గతంలో అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే స్థానిక జిల్లా ఎస్పీ నివాసం నుంచి పాత బస్టాండ్ వరకు ఏర్పాటు చేసిన ఈ బారికేడ్లపై నుంచి వాహనదారులు ప్రయాణించడంతో అవి ఇలా ఉండీ లేనట్లుగా తయారయ్యాయి. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రభుత్వాస్పత్రి ముందు నుంచి ప్రజలు రోడ్డుదాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సిందే. జిల్లాలోని ముఖ్య అధికారుల నివాసం దగ్గరే ఇలా ఉంటే పట్టణంలోని ప్రధాన దారులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే ట్రాఫిక్ బారికేడ్లు కొత్తవి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

తాత్కాలికంగా ప్రజావాణి రద్దు

తాత్కాలికంగా ప్రజావాణి రద్దు