
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
జహీరాబాద్ టౌన్/జహీరాబాద్: ఆధ్యాత్మికత, భజన ద్వారా భగవంతుని నామాన్ని, కీర్తనలను పాడటం వల్ల మానసిక శాంతి, ఆనందం కలుతుందని ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. దేవీశరన్నవరాత్రి ఉత్సక కమిటీ, భవానీ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతరాష్ట్ర భజన పోటీలకు ఎమ్మెల్యే హాజరై భజన కళాకారులను ఘనంగా సన్మానించారు.అనంతరం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా కృషి చేసి సత్తా చాటాలన్నారు. దైవ నామాన్ని జపించడం వల్ల దైవంతో గట్టి బంధం ఏర్పడుతుందన్నారు. పట్టణంలో అంతరాష్ట్ర భజన పోటీలను నిర్వహణతో పాటు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు అభినందించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నారింజ ప్రాజెక్టు సందర్శన
జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) వద్ద గల నారింజ ప్రాజెక్టును డీసీఎంఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ ఎం.శివకుమార్‌తో కలిసి కె.మాణిక్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా జహీరాబాద్–బీదర్ రహదారిపై ప్రాజెక్టు ఉన్నందున ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఇరిగేషన్, పోలీసు అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తుండగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1,900 క్యూసెక్కులు ఉండటంతో, ఔట్‌ఫ్లో 2,150 క్యూసెక్కులుగా మెయింటెన్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మాణిక్‌రావు