
కుమ్మరించిన వాన
సిరిసిల్ల: జిల్లాలో ఆదివారం అనూహ్యంగా వర్షం కురిసింది. పెద్దూరు వద్ద అత్యధికంగా 64.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కోనరావుపేట మండలం మర్తనపేట వద్ద 60.3 మిల్లీమీటర్లు, వేములవాడ శివారులోని నాంపల్లి వద్ద 39.0, గంభీరావుపేటలో 34.0, సిరిసిల్లలో 29.3, ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో 26.3, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లో 24.5, ఎల్లారెడ్డిపేటలో 21.3, వేములవాడరూరల్ మండలం మల్లారంలో 16.3, తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 11.0, వీర్నపల్లి మండలం వన్‌పల్లిలో 10.5, కోనరావుపేట మండలం నిజా మాబాద్‌లో 9.8, వేములవాడ మండలం వట్టెంలలో 9.3, బోయినపల్లిలో 5.8, రుద్రంగిలో 2.0, చందుర్తి మండలం మరిగడ్డలో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
వేములవాడ: పట్టణంలో భారీ వర్షం కురవడంతో రాజన్న ఆలయం ఎదుట రోడ్డుపై వరద ప్రవహించింది. వర్షంలోనే తడుస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ముస్తాబాద్: ముస్తాబాద్, గూడెం, పోతుగల్ గ్రామాల్లో కోతలకు వచ్చిన వరిపంట నేలవాలింది. ఈదురుగాలులతో వర్షం పడడంతో వరిపంట దెబ్బతిందని రైతు తాళ్ల చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
వీర్నపల్లి/కోనరావుపేట: మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కోనరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో కలిపి సుమారు 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నారాయణపూర్ శివారులోని దుర్గమ్మ ఆలయం వద్ద వర్షానికి చెట్టు నెలకూలింది. రోడ్డుపై పడడంతో నారాయణపూర్ నుంచి రాగట్లపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి.