
సమస్యలు పరిష్కరించండి
● ఏడాది పొడవునా పని ఉండేలా చూడండి.. ● వస్త్రోత్పత్తిదారుల ‘కరెంట్’ సమస్యను పరిష్కరించండి ● మంత్రి సీతక్కకు వెల్లువలా వినతులు
సిరిసిల్ల: నేతన్నలకు ఏడాది పొడవునా చేతినిండా పని ఉండేలా చూడాలని కొందరు.. ప్రభుత్వ ఆర్డర్లతోనే మేలైనా కూలీ వస్తోందని.. మరిన్ని ఆర్డర్లు ఇవ్వాలని మరికొందరు.. వస్త్రోత్పదారులపై విధిస్తున్న విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని మరికొందరు.. ఇలా మంత్రి సీతక్కకు వినతలు వెల్లువలా వచ్చాయి. సిరిసిల్లలో తొలిసారి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క సోమవారం పర్యటించారు. వెంకట్రావునగర్‌లోని పవర్‌లూమ్ కార్ఖానా నుంచి, ఇందిరానగర్‌లోని చీరల బట్టను సేకరించే గోదాం, ప్రాసెసింగ్ యూనిట్ వరకు వస్త్రోత్పత్తిలోని వివిధ దశలను పరిశీలించారు. నేతకార్మికులు, వైపని కార్మికులు, ఆసాములు, వస్త్రోత్పత్తిదారలతో మాట్లాడారు. మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన సీతక్కకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ప్రకాశ్, సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, గౌతమ్, రెడ్డినాయక్, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, కల్లూరి చందన, గోనె శరణ్య జౌళిశాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్‌రావు, వస్త్రోత్పత్తిదారులు గోవిందు రవి, ఆడెపు భాస్కర్, వెల్దండి దేవదాస్, అన్నల్‌దాస్ అనిల్‌కుమార్, తాటిపాముల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
నేతకళాకారుడికి సన్మానం
చేనేత శిల్పి నల్ల పరంధాములు తనయుడు నల్ల శ్రావణ్‌ను మంత్రి సీతక్క శాలువాతో సన్మానించారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖచిత్రాన్ని అగ్గిపెట్టెలో పట్టే శాలువాపై నేసారు.
కరెంట్ సమస్యను పరిష్కరించండి
చిన్నతరహా పరిశ్రమల పేరిట బ్యాక్ బిల్లింగ్ అని ‘సెస్’ అధికారులు కోర్టు ఆదేశాలను సాకుగా చూపి రూ.కోట్ల కరెంట్ బిల్లులు వేశారని మంత్రికి వస్త్రోత్పత్తిదారులు వివరించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ‘సెస్’ చైర్మన్ తమపై కక్ష గట్టి వేధిస్తున్నాడని, బ్యాక్ బిల్లింగ్ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. పట్టణంలోని బీ.వై.నగర్‌లో అందరికీ అందుబాటులో ఉన్న చేనేత, జౌళిశాఖ ఆఫీస్‌ను రగుడు శివారులోని కలెక్టరేట్‌కు మార్చారని, దాన్ని గతంలో కొనసాగించిన భవనంలోకి తరలించాలని పాలిస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. సిరిసిల్ల మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులను అకారణంగా విధుల నుంచి తప్పించారని, తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆయా సంస్థల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు మంత్రికి వినతిపత్రం అందించారు.

సమస్యలు పరిష్కరించండి