
పారదర్శకం
ఉపాధిహామీ ఇలా..
‘ఉపాధి’
● జియో ఫెన్సింగ్‌తో కూలీల హాజరు ● పనుల గుర్తింపు సైతం ● ఉపాధిహామీ జాబ్‌కార్డులు 98వేలు ● గుర్తించిన పనులు 23వేలు
ముస్తాబాద్(సిరిసిల్ల): జాతీయ ఉపాధిహమీ పనుల్లో పారదర్శకతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు జియో ట్యాగింగ్ ద్వారా కూలీల హాజరు నమోదు చేసిన అధికారులు ఇక నుంచి జియో ఫెన్సింగ్ ద్వారా పనులు, హాజరును నమోదు చేయనున్నారు. పనికి ముందు, తరువాత చేసిన పనులే కాదు.. కూలీల హాజరు నమోదును మూడుసార్లు చేసేందుకు జియో ఫెన్సింగ్‌ను ఉపయోగిస్తారు. ఈమేరకు టెక్నికల్ అసిస్టెంట్లకు ప్రభుత్వం ఇప్పటికే శిక్షణను ఇచ్చింది. జియో ఫెన్సింగ్ విధానంపై పక్షం రోజుల క్రితమే శిక్షణ తరగతులు నిర్వహించారు. అక్టోబర్ నుంచి చేపట్టబోయే కొత్త పనులను జియో ఫెన్సింగ్ చేయనున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.21.78 కోట్ల విలువైన ఉపాధిహామీ పనులు చేపడుతున్నారు.
ఏమిటీ జియో ఫెన్సింగ్
ఉపాధిహామీ గ్రామసభల్లో తీర్మానం చేసి గుర్తించిన పనులకు అధికారులు, సిబ్బంది ప్రతిపాదనలు చేస్తారు. పనుల మంజూరుకు ముందే టెక్నికల్ అసిస్టెంట్లు గుర్తించిన పనులకు జియోఫెన్సింగ్ చేస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా పని ప్రదేశంలో జియోఫెన్సింగ్‌కు సరిహద్దులు నిర్ణయిస్తారు. గుర్తించిన పనిని నాలుగు వైపుల నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. పనికి ముందు.. పనికి మధ్యలో.. పని తరువాత.. జియో ఫెన్సింగ్ చేసి కూలీల నమోదు చేసి అప్‌లోడ్ చేస్తారు. గతంలో కూలీలు పనులు మొదలుపెట్టిన చోట నమోదైన ఫొటోతోపాటు గుర్తించిన పనిలో సరిహద్దులు దాటకుండా పని చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు పనిప్రదేశంలో జియో ఫెన్సింగ్ ద్వారా గుర్తించి కూలీలకు పనులు అప్పగిస్తారు. దాని ప్రకారమే పనులు చేస్తారు. కూలీల హాజరు నమోదులో సులభతరం చేయడంతోపాటు పారదర్శకంగా పనులు జరిగేలా జియోఫెన్సింగ్ విధానం ఉపయోగపడుతుంది. కూలీలు పనులు చేసుకుంటూ కిలోమీటర్ల పరిధిలో నడిచి వెళ్తారు. పనులు పూర్తయిన తర్వాత మొదట ఫొటో దిగిన పని ప్రదేశానికి సదరు కూలీ రావాల్సి ఉంటుంది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు ఇబ్బందులు పడేవారు. జియో ఫెన్సింగ్‌తో పని ప్రదేశంలో ఎక్కడ ఉన్న కూలీల హాజరును ఆన్‌లైన్ చేయవచ్చు.
ఒకసారి ఒకే పని
జియోఫెన్సింగ్ ద్వారా ఒకసారి చేపట్టిన పనిని మరోసారి చేపట్టరాదు. ఇప్పటి వరకు ఇలా అనేక చెరువులు, కుంటలు, కెనాల్స్‌ను పదుల సార్లు చేశారు. ఒకసారి జియోఫెన్సింగ్‌లో నమోదైన పనిని తిరిగి చేపట్టేందుకు వీలుకాదు. జియోఫెన్సింగ్ ద్వారా గుర్తించిన పనిప్రదేశంలో నాలుగు వైపులా నుంచి ఎక్కడి నుంచైన కూలీ హాజరును నమోదు చేయవచ్చు. జియో ట్యాగింగ్ ద్వారా గతంలో ఒక మూలనే కూలీ హాజరును తీసుకునేవారు. అయితే సెల్‌ఫోన్ నెట్‌వర్క్ లేనిచోట సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకరోజు మొబైల్ పనిచేయకుంటే ఆరోజు హాజరు నమోదుకాదు. దీని ద్వారా కూలీలు నష్టపోయే ప్రమాదం ఉంది.
ఉపాధిహామీ పనుల్లో కూలీలు
జాబ్‌కార్డులు : 98వేలు
యాక్టివ్ జాబ్‌కార్డులు : 61వేలు
గుర్తించిన కూలీలు : 2 లక్షలు
యాక్టివ్ వర్కర్లు : 93వేలు
గుర్తించిన పనులు : 23వేలు
కేటాయించిన బడ్జెట్ : రూ.21.78 కోట్లు

పారదర్శకం