
సమయపాలన పాటించాలి
● డీఎంహెచ్‌వో రజిత
బోయినపల్లి(చొప్పదండి): పీహెచ్‌సీల్లో విధులు నిర్వహించే వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో రజిత ఆదేశించారు. మండలంలోని కొదురుపాక పీహెచ్‌సీని శనివారం తనిఖీ చేశారు. డాక్టర్, వైద్యసిబ్బంది హాజరు రిజిస్టర్, కేంద్ర ఆరోగ్య పథకాలకు సంబందించిన పలు రికార్డులను పరిశీలించారు. సకాలంలో విధులకు హాజరుకాకుంటే సీసీఏ రూల్స్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐదేళ్లలోపు చిన్నారుల వ్యాక్సిన్.. మందుల నిల్వలను పరిశీలించారు.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సీనియర్ సిటిజన్ల సంఘం ఆధ్వర్యంలో వయోధికుల దినోత్సవం సందర్భంగా వస్త్రవ్యాపార సంఘం భవనంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వయోధికుల సంక్షేమ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణ బాధ్యతలు విస్మరించిన వారసులకు ఆస్తులను జప్తు చేస్తామన్నారు. వారసత్వంగా లభించిన ఆస్తులను తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్నారు. నిరాధరణకు గురైన వయోవృద్ధులను ఆశ్రమాల్లో ఉంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్ల సంఘం బాధ్యులు ఆర్డీవోను సత్కరించారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చేపూరి బుచ్చయ్య, డాక్టర్ జనపాల శంకరయ్య, కోడం నారాయణ, దొంత దేవదాసు, మోతిలాల్, సి.రామరాజు, సజ్జనం శ్రీనివాస్, బాదం ప్రకాశ్, గౌరిశెట్టి ఆనందం, అంకారపు జ్ఞానోభ, పి.సత్యనారాయణ, బుర్ల సారంగం, నల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
స్థానిక పోరుకు సిద్ధం
సిరిసిల్లటౌన్: స్థానిక సంస్థల పోరుకు సీపీఎం సిద్ధమైందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ స్పష్టం చేశారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సూరం పద్మ, శ్రీరాముల రమేశ్‌చంద్ర, సందుపట్ల పోచమల్లు, గడ్డం రాజశేఖర్ పాల్గొన్నారు.
మహిళల శ్రమను గౌరవించాలి
సిరిసిల్లటౌన్: శ్రామిక మహిళల శ్రమను గౌరవించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీపీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. స్థానిక బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవన్‌లో శనివారం శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థిక, సామాజిక అణచివేత, పనిభద్రత, వేతనాలు లేని శ్రమ తదితర సమస్యలపై సీఐటీయూ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతుందన్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యక్రమం రూపొందించేందుకు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు ఈనెల 5, 6 తేదీల్లో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ సూరం పద్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, చందుపట్ల పోచమల్లు, లలిత, ఇందిర, ఎల్లవ్వ పాల్గొన్నారు.

సమయపాలన పాటించాలి

సమయపాలన పాటించాలి

సమయపాలన పాటించాలి