
డేంజర్ టర్నింగ్స్
ప్రమాదకరంగా మూలమలుపులు
కనిపించని సూచికలు, హెచ్చరికబోర్డులు
బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. వేములవాడ డివిజన్‌లోని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖ రోడ్లపై మూలమలుపులు మృత్యు పిలుపులుగా మారాయి. మలుపుల వద్ద కనీసం సూచికబోర్డులు కనిపించడం లేదు. హెచ్చరికబోర్డులు అసలే లేవు.
సూచికలు కరువు
బీటీ రోడ్డు వెంట ఉన్న మూలమలుపుల వద్ద పంచాయతీరాజ్ అధికారులు ప్రమాద సూచికలు పెట్ట లేదు. బోయినపల్లిలో మూలమలుపు వద్ద గతంలో ఓ లారీ ఇనుప విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టింది.
తరచూ ప్రమాదాలు
● కోనరావుపేట మండలం నిజామాబాద్–కోనరావుపేట మార్గంలోని ఓ మూలమలుపు వద్ద బైక్‌పై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి మృతిచెందాడు. బోయినపల్లి నుంచి వేములవాడ, బూర్గుపల్లి నుంచి కోరెం, తడగొండ నుంచి మల్కాపూర్, బోయినపల్లి నుంచి విలాసాగర్, మర్లపేట వెళ్లే రహదారుల్లో మూలమలుపులు ఉన్నాయి. బోయినపల్లి పోస్టాఫీసు, యూనియన్ బ్యాంకు, పాత సెస్ కార్యాలయాల వద్ద ఎదురుగా వాహనం వస్తే ఇబ్బంది ఏర్పడుతోందని ప్రయాణికులు అంటున్నారు. ఇక్కడ రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఒకటి వెనక్కి తీసుకుంటే మరొకటి ముందుకు వెళ్లే పరిస్థితి. బోయినపల్లి మండలం స్తంభంపల్లి నుంచి వేములవాడ వెళ్లే బీటీ రోడ్డులో వాటర్‌ప్లాంట్ వద్ద మూలమలుపు డేంజర్‌గా ఉంది.
● విలాసాగర్–కరీంనగర్ దారిలో హైస్కూల్ వద్ద టర్నింగ్ డేంజర్‌గా ఉంది.
● తడగొండ నుంచి మల్కాపూర్ వెళ్లే దారిలో పలు చోట్ల మూలమలుపులు ఉన్నాయి.
● వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి గుడి పరిసరాల్లో టర్నింగ్ ఉంది.
● వేములవాడరూరల్ మండలంలో నూకలమర్రి–వట్టెంల, వేములవాడ–మల్లారం రోడ్డులో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి.
ఈ చిత్రంలో ఒక టర్నింగ్ కోనరావుపేట నుంచి నిమ్మపల్లి, మరొకటి కోనరావుపేట నుంచి సిరిసిల్ల వెళ్తుంది. ఒకే చోట నుంచి రెండు చోట్లకు టర్నింగ్ తీసుకోవాల్సి ఉంది. ఏ వాహనం ఎటు వెళ్తుందో దగ్గరకు వచ్చే వరకు తెలియదు. ఇంత ప్రమాదకరంగా వాహనదారులు ప్రయాణిస్తున్నారు.