
కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్త
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్‌టౌన్: కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను బీజేపీ కై వసం చేసుకోబోతోందని, సర్వే నివేదికలు ఇదే విషయం తేటతెల్లం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్స్‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ ప్రభారీల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, తాను సైతం ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజామాజీ సర్పంచులు, రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులే ఈసారి కాంగ్రెస్ ను ఓడించబోతున్నారని, బీజేపీకి వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు కాబోతున్నారన్నారు. అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపు విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని, ఇప్పటికే సర్వేలు చేయిస్తోందని తెలిపారు. సర్వే నివేదికలను బట్టి గెలుపే ప్రాతిపదికన టిక్కెట్లు వస్తాయని స్పష్టం చేశారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్‌రావు, డి.శంకర్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, కోమాల అంజనేయులు, వాసాల రమేశ్ పాల్గొన్నారు.