
ఆత్మీయతలు కనుమరుగయ్యాయి
ఊరు మారింది.. పండుగ తీరు మారింది ఆ రోజులు వేరుగా ఉండేవి గుర్తుకొస్తున్నాయంటున్న సీనియర్ సిటిజన్లు
సిరిసిల్ల: దసరా వచ్చిందంటే పల్లెలు సందడిగా మారిపోతుంటాయి. పుట్టిన ఊరిలోనే పుష్కలంగా ఉపాధి దొరికిన రోజుల్లో అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి వెతుక్కుంటూ పల్లె యువత ఖండాంతరాలు దాటిపోతున్నారు. ఒకప్పుడు నిత్యం సందడిగా ఉన్న పల్లె నేడు పండుగకో.. పబ్బానికో మాత్రమే నిండుగా కనిపిస్తుంది. మూడు దశాబ్దాల క్రితం విద్యాసంస్థలకు దసరా సెలువులు వచ్చాయంటే బంధువులందరూ ఒక్కచోట చేరేవారు. వారం, పది రోజులపాటు పల్లె కళకళలాడేది. పిల్లలకు స్కూల్ సెలవులు.. మహిళలకు బతుకమ్మ.. మగవారికి దసరా.. ఇలా ఆ సరదాలే వేరుగా ఉండేవి. నేడు అంతా మారిపోయింది. ఉపాధి కోసం పట్టణం, విదేశాల్లో స్థిరపడ్డ పిల్లలు ఒక్క రోజు ముందుగా వచ్చి పండుగ మరుసటి రోజే ఉద్యోగమంటూ వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సీనియర్ సిటిజన్స్‌ను ‘సాక్షి’ బుధవారం పలకరించగా.. వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు.. ఆనాటి దసరా పండుగ సరదాల ఆవిష్కరణ ఇదీ..
మాది ముస్తాబాద్. ఆ రోజుల్లో దసరా ఎంతో ఉత్సాహంగా సాగేది. ఊరంతా కలిసి పెద్దచెరువు కట్టపైకి వెళ్లేవాళ్లం. అక్కడ పాలపిట్టను చూసి, జమ్మిచెట్టుకు మొక్కి వచ్చేవాళ్లం. కుటుంబ సభ్యులతోపాటు అందరం కలిసేది దసరా పండుగకే. దూరపు బంధువులు, ఎక్కడెక్కడో స్థిరపడిన స్నేహితులు.. ముస్తాబాద్‌కు వచ్చేది ఈ పండగ రోజే. ఆత్మీయ పలకరింపులతో ఎంతో ఉత్సాహంగా ఉండేది.
– రాజూరి శేఖరయ్య, వ్యాపారి, సిరిసిల్ల
మాది గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్. కానీ సిరిసిల్లలోనే స్థిరపడ్డాం. మా చిన్నతనంలో ఊరిలో దసరా పండుగ అంటే.. జమ్మిచెట్టు వద్దకు వెళ్లడం, ఊరిలో అందరూ కోలాటం ఆడుతూ.. జడలు వేసి.. విప్పుతూ.. ఎంతో సంబురంగా ఉండేది. జమ్మి ఆకు పెట్టుకుని ఆత్మీయంగా ఆలింగనం చేసుకునే వాళ్లం. ఇప్పుడు ఆనాటి ఆత్మీయత లేదు. బతుకమ్మ పండగకు దాండియా ఆడుతున్నారు. పాటలు పాడేవాళ్లు లేరు.. పండగ విశిష్టతను దెబ్బతీస్తున్నారు.
– గంజి బుచ్చిలింగం, సిరిసిల్ల
మా చిన్నతనంలో మా నాన్న ఎడ్లబండ్లపై వెళ్లి చెన్నూరు గో దావరి నదిలో స్నానాలు చేసే వాళ్లం. జమ్మి ఆకు(బంగారం) పెట్టుకుని దసరా జరుపుకునేవాళ్లం. శుచి, శుభ్రతకు మా నాన్న ప్రాధాన్యతనిచ్చేవారు. నిజానికి కరోనా వచ్చిన తరువాత కాళ్లు, చేతులు కడుక్కోవడం చూశాం. కానీ మా చిన్నతనంలో మా నాన్న ఇవన్నీ పాటించాలని చెప్పేవారు. దసరా పండుగ పూట స్నేహితులను కలిసేది. అందరం కలిసి భోజనం చేసేది. – శ్రీరాంభట్ల సంతోష్‌శర్మ, సిరిసిల్ల
ఆనాటి సంతోషాలు ఇప్పుడు లేవు. మా చిన్నప్పుడు పండుగ చాలా గొప్పగా జరిగేది. ఆత్మీ యుల మధ్య పిండివంటలతో సందడిగా ఉండేది. దసరా పూ ట జంబీ(బంగారం) పెట్టుకుని ఆత్మీయతను పంచుకుని పులకించి పోయేవాళ్లం. ఊరంతా స్నేహితులతో కలిసి తిరిగేవాళ్లం. ఇప్పు డు అంతా సెల్‌ఫోన్ యుగమైపోయింది. మన పండుగల ప్రత్యేకత మరుగునపడుతుంది. వరసలు పె ట్టి పిలుచుంటూ ప్రేమగా ఉండేది. ఆనాటి ఆత్మీయతలు లేవు. – కొనుగుల్‌వార్ శ్రీనివాస్

ఆత్మీయతలు కనుమరుగయ్యాయి

ఆత్మీయతలు కనుమరుగయ్యాయి

ఆత్మీయతలు కనుమరుగయ్యాయి

ఆత్మీయతలు కనుమరుగయ్యాయి