
రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరిత
సిరిసిల్ల: జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.హరిత సూచించారు. కలెక్టరేట్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై రాజకీయపార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ర్యాలీలు, సభలు, ప్రచారాలు నిబంధనల ప్రకారం నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రెండు, మూడో విడతలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫిర్యాదుల నమోదుకు కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్, ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫొద్దీన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నాయకులు తీగల శేఖర్‌గౌడ్, గజభీంకార్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.