
అతివేగం.. అధిక లోడ్
ఆర్టీఏ తనిఖీలు శూన్యం.. జాడలేని మైనింగ్
● గ్రానైట్ లారీల రాకపోకలతో రోడ్లు ధ్వంసం ● ప్రమాదకరంగా గంగాధర–కొదురుపాక రోడ్డు ● ధ్వంసమవుతున్న వంతెనలు ● ఇటీవల తరచూ ప్రమాదాలు ● భయాందోళనలో ప్రయాణికులు
బోయినపల్లి(చొప్పదండి): హెవీ లోడ్.. హై స్పీడ్.. ఫలితంగా ఛిద్రమైన రోడ్లు. ఇదీ రెండు జిల్లాలను అనుసంధానం చేసే గంగాధర–కొదురుపాక రోడ్డు దుస్థితి. ఈ మార్గంలో నిత్యం పదుల సంఖ్యలో గ్రానైట్ లారీలు తిరుగుతుంటాయి. భారీ సైజులో బండరాళ్లతో వెళ్తుండడంతో రోడ్లు, వంతెనలు ధ్వంసమవుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగిపోయాయి. పెద్ద గుట్ట మాదిరిగా వెళ్తున్న వాహనాలు చూస్తేనే ద్విచక్రవాహనదారులు, ఇతర ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.
భారీ సైజు బండరాళ్లు..
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు గ్రానైట్ క్వారీల నుంచి బోయినపల్లి, కొదురుపాక గ్రామాల మీదుగా బావుపేట గ్రానెట్ ఫ్యాక్టరీలకు నిత్యం పెద్ద మొత్తంలో గ్రానెట్ బండ లారీలు వెళ్తుంటాయి. నర్సింగాపూర్ క్వారీల నుంచి పెద్ద స్లాబ్‌లను కరీంనగర్, బావుపేట తరలిస్తారు. నెల క్రితం కొదురుపాక నుంచి బోయినపల్లి వైపు వస్తున్న ఓ గ్రానైట్ లారీ పెట్రోల్‌బంక్ కల్వర్టు వద్ద బోల్తాపడింది. అదృష్టవశాత్తు డ్రైవర్‌కు ఏమీ కాలేదు. గతేడాది జూలైలో కొదురుపాక వద్ద ఓ గ్రానైట్ బండలారీ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. నర్సింగాపూర్, వెంకట్రావుపల్లి రోడ్లపై గతంలో హెవీ లోడ్‌తో ఉన్న లారీలు దిగబడి ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. గంగాధర నుంచి వచ్చే బండ లారీలు బోయినపల్లి బస్టాండ్ ప్రాంతంలో విపరీతమైన వేగంతో వెళ్తుండడంతో బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు, వివిధ పనులపై బస్టాండ్‌కు వచ్చే స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
గంగాధర నుంచి కొదురుపాక టు బావుపేట
గంగాధర మండలంలోని పలు గ్రామాల నుంచి బోయినపల్లి మండలం కొదురుపాక, వెంకట్రావుపల్లి మీదుగా కొత్తపల్లి మండలం బావుపేట స్లాబ్ కటింగ్ ఫ్యాక్టరీలకు నిత్యం 10 నుంచి 20 సంఖ్యలో గ్రానైట్‌లారీలతో స్లాబ్‌లు తరలుతున్నాయి. బోయినపల్లి మండలం నర్సింగాపూర్ క్వారీల నుంచి సైతం గ్రానైట్‌లారీలు హెవీ లోడ్‌తో స్లాబ్‌లు జారవేస్తాయి. బావుపేట ఫ్యాక్టరీల్లో బండరాళ్లతో స్లాబ్స్ కట్ చేస్తారు. గంగాధర నుంచి బోయినపల్లి, కొదురుపాక వరకు డబుల్ రోడ్డు ఉండడంతో పదుల సంఖ్యలో గంగాధర మండలం నుంచి వచ్చే బండలారీలు బావుపేటకు తరలుతున్నాయి. గంగాధర మండలం మీదుగా బోయినపల్లి మండలం కొదురుపాక మీదుగా వెళ్లే బండలారీలు అతివేగంగా వెళ్తుంటాయి. అధికలోడ్ లారీలతో బోయినపల్లి, దేశాయిపల్లి వద్ద రోడ్లు, వంతెనలు పాడవుతున్నాయంటున్నారు.
గంగాధర కొదురుపాక డబుల్‌రోడ్డుపై హెవీ లోడ్‌తో వెళ్లే బండలారీల ఫిట్‌నెస్‌పై ఆర్టీఏ అధికారులు తనఖీలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. లారీ ఫిట్‌నెస్ ఎలా ఉంది? ఎన్ని టన్నుల్లో స్లాబ్స్ తీసుకెళ్లవచ్చు అనే అంశాలను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వా హనపత్రాలు సరిగా ఉన్నాయా? లైసెన్స్ ఉన్న డ్రైవర్లు నడుపుతున్నారా? అనే వాటిని పరిశీలించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ అధికారుల నిఘా కొరవడడంతో కొన్ని చోట్ల లీజ్ అగ్రిమెంట్‌లు ముగిసినా యథేచ్ఛగా గ్రానై ట్ తవ్వకాలు చేపడుతున్నారని, రాయల్టీ చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. లీజ్ అగ్రిమెంట్ల గురించి పంచాయతీ కార్యదర్శులను, రెవె న్యూ అధికారులను అడిగితే తెలియదని దాటవేస్తున్నారు. నర్సింగాపూర్, కొత్తపేట క్వారీల్లో అ నుమతులకు మించి మైనింగ్ చేస్తున్నారని ఆరో పణలు ఉన్నాయి. నర్సింగాపూర్ గ్రామం కరీంనగర్‌కు దగ్గరగా ఉండడంతో అటువైపు అధికారులు వెళ్లడం లేదంటున్నారు. గ్రానెట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనిఖీలకు అధికారులు రాకుండా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అతివేగం.. అధిక లోడ్