
జీతాలు ఇచ్చి ఆదుకోండి
● ఎల్లారెడ్డిపేటలో స్వీపర్ల ర్యాలీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తొమ్మిది నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, పండుగ పూటనైనా ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ స్వీపర్లు, స్కావెంజర్లు గురువారం ఎల్లారెడ్డిపేటలో ర్యాలీ తీశారు. అనంతరం ఎంఈవో కృష్ణహరికి వినతిపత్రం అందించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆదర్శ కమిటీల ద్వారా నియమించిన స్కావెంజర్లకు పోయిన ఏడాది ఐదు నెలల 15 రోజులు, ఈ ఏడాదిలో నాలుగు నెలల జీతాలు ఖాతాల్లో జమచేయాలని కోరారు. విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా అందరికీ ఒకేరకమైన జీతాలు ఇవ్వాలని కోరారు. నాయకులు మీసం లక్ష్మణ్, వెంకటేశ్, మహేశ్, వరలక్ష్మి, సాయికృష్ణ, నర్సయ్య, రజిత, లత, మంజుల, నర్సవ్వ, నాగమణి, అంజవ్వ తదితరులు పాల్గొన్నారు.