ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ ఇలా..
ఏకరూపం.. పాలపిట్ట వర్ణం
సిరిసిల్లలో ఉత్పత్తి.. సూరత్‌లో ప్రాసెసింగ్
జిల్లాలో 1,15,597 మంది మహిళలకు చీరలు
సిరిసిల్ల: తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ బతుకమ్మకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరలను కానుకగా అందిస్తుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలలోని (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు సీఎం రేవంత్‌రెడ్డి కానుకగా ఈ సద్దుల బతుకమ్మకు చీరలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 26న సిరిసిల్ల వేదికగా రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ ఇందిరా మహిళాశక్తి చీరలను ప్రదర్శించారు. ఏకరూపం, పాలపిట్ట రంగుల్లో ఆకర్షణీయంగా ఉన్నాయి.
సిరిసిల్ల నుంచి సూరత్
సిరిసిల్లలో 4.24 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 2.50 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేశారు. 10వేల మగ్గాలపై 131 మ్యాక్స్ సంఘాల్లో ఇందిరా మహిళాశక్తి చీరలు తయారయ్యాయి. నేతకార్మికులు ఉత్పత్తి చేసిన చీరలను చేనేత, జౌళిశాఖ సేకరించింది. ఆ బట్టను ప్రాసెసింగ్, ప్రింటింగ్ చేయించేందుకు గుజరాత్‌లోని సూరత్‌కు పంపించారు. అక్కడ పాలపిట్ట కలర్‌లో బార్డర్ అంచుతో చీరలను సిద్ధం చేశారు. చీరల ఆర్డర్లతో స్థానిక నేతన్నలకు 10 నెలలపాటు చేతి నిండా పని లభించింది.
నవ్యత.. నాణ్యత
గతంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తే.. అవి కట్టుకోడానికి అనువుగా లేవని, పొలాల వద్ద రక్షణ గా కట్టుకున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా అన్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా మహిళాశక్తి చీరలను నవ్యత, నాణ్యతతో ఉత్పత్తి చేశారు. వస్త్రోత్పత్తిదారులకు వేములవాడలోని టెస్కో యారన్ డిపో నుంచి నూలు(ధారం)ను జౌళిశాఖ అధికారులే సరఫరా చేశారు. నాణ్యమైన నూలును అందించడంతో అంచుతో కూడిన తెల్లని చీరలను తయారు చేశారు. జిల్లాలోని మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 50 ఏళ్లు పైబడి గోచీ చీరలను కట్టే వారికి ప్రత్యేకంగా 9.30 మీటర్ల పొడవైన చీరలను పంపిణీ చేయనున్నారు. గోచీ చీరలు కట్టే వారి సంఖ్యను 12,067గా నిర్ధారించారు. ఈ మేరకు గోచీ చీరలను తెప్పిస్తున్నారు. మరో వైపు మిగతా వారికి 6.30 మీటర్ల చీరలను అందించనున్నారు.
కలెక్టర్ అధ్యక్షతన కమిటీ
జిల్లా స్థాయిలో చీరల పంపిణీకి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధ్యక్షతన కమిటీ ఉంటుంది. మండలాల్లో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల పర్యవేక్షణలో చీరల పంపిణీ కొనసాగనుంది. ఈనెల 21న చిన్న బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతుండడంతో చీరలను ఎప్పుడు పంపిణీ చేయాలో ప్రభుత్వమే తేదీని నిర్ణయించనుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీవోలు, పట్టణాల్లో వార్డు అధికారులు, ఆర్పీలు ఇన్‌చార్జీలుగా చీరల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేశారు.
మండలం వీవోఏలు మహిళాసంఘాలు మహిళలు
బోయినపల్లి 31 816 9,766
చందుర్తి 30 760 9,052
ఇల్లంతకుంట 46 1,122 13,186
గంభీరావుపేట 44 1,157 12,791
కోనరావుపేట 41 1,037 11,942
ముస్తాబాద్ 54 1,210 14,169
రుద్రంగి 14 386 4,464
తంగళ్లపల్లి 49 1,101 12,462
వీర్నపల్లి 18 347 4,041
వేములవాడ 17 413 4,923
వేములవాడరూరల్ 21 496 5,923
ఎల్లారెడ్డిపేట 46 1,170 12,878
మొత్తం 411 10,015 1,15,597
‘బతుకమ్మ’కు ఇందిరమ్మ చీరలు