
హోంగార్డులు క్రమశిక్షణతో పనిచేయాలి
● ఎస్పీ మహేశ్ బి గీతే
సిరిసిల్ల: పోలీస్‌శాఖలో అంతర్‌భాగమైన హోంగార్డులు క్రమశిక్షణతో పనిచేయాలని జిల్లా ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో శుక్రవారం హోంగార్డులను డీజీపీ ఆఫీస్ ద్వారా వచ్చిన రెయిన్‌కోట్స్‌ను పంపిణీ చేశారు. ఎస్పీ మహేశ్ బి గీతే మాట్లాడుతూ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు పోలీసులతోపాటే నిరంతరం సేవలను అందిస్తున్నారని, ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో పోలీసు సిబ్బందితోపాటు విధులు నిర్వహిస్తున్నారన్నారు. హోంగార్డులు క్లిష్ట పరిస్థితుల్లోనూ బందోబస్తు విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఏమైనా సమస్యలుంటే నేరుగా తనని సంప్రదించాలన్నారు. వర్షాకాలంలో అత్యవసర సమయాల్లో రెయిన్‌కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఎస్పీలు శేషాద్రినిరెడ్డి, చంద్రయ్య, ఆర్‌ఐలు యాదగిరి, హోమ్‌గార్డ్స్ పాల్గొన్నారు.