
టీచర్ల పోరుబాట
కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఉపాధ్యాయుల ఆగ్రహం సమస్యల పరిష్కారంలో కూటమి విఫలం నేడు ఉపాధ్యాయుల ‘చలో విజయవాడ’ అసెస్మెంట్ బుక్‌ను పునఃసమీక్షించాలంటూ డిమాండ్ సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని పట్టు బోధనేతర పనులతో పాఠాలకు దూరమవుతున్న టీచర్లు
కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోగా వారిపై బోధనేతర పనుల భారాన్ని మోపుతూ
విద్యాబోధనకు దూరం చేస్తోంది. ఫలితంగా విద్యార్థులకు చదువు
దూరమవుతోంది. కూటమి
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర
కావస్తున్నా ఉపాధ్యాయులకు
సంబంధించిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా తమపై పనిభారం మోపుతున్నారంటూ టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు.
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మాటతప్పింది. అడ్డగోలు నిర్ణయాలతో ఉపాధ్యాయుల మీద మరింత ఒత్తిడి పెంచింది. విద్యార్థులకు చదువులు చెప్పకుండా, ఇతర పనులు అప్పగించడంతో సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. దీంతో ఉపాధ్యాయుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రకరకాల పనులను ఉపాధ్యాయులపై రుద్దింది. చంద్రబాబు తన ప్రచార యావతో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి ఉపాధ్యాయులను స్కూళ్లకు దూరం చేశారు. అలాగే పేరెంట్, టీచర్స్ సమావేశాల పేరుతో దాదాపు రెండు వారాలపాటు ఉపాధ్యాయులు పాఠాలకు దూరమయ్యారు. దీనికి తోడు రకరకాల శిక్షణ పేరుతో టీచర్లు బడులకు వెళ్లలేక పోయారు. ఫలితంగా విద్యార్థులు సైతం చదువులకు దూరమయ్యారు. కూటమి ప్రభుత్వం ఆంక్షలతో కొంతకాలం మౌనం వహించిన ఉపాధ్యాయ సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. సమస్యల పరిష్కారం కోసం, హక్కులను కాపాడుకునేందుకు జిల్లాలో సుమారు 11 వేల మంది ఉపాధ్యాయులు ఆందోళనబాటపట్టారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై విజయవాడ ధర్నా చౌక్‌లో నేడు రాష్ట్రస్థాయి ధర్నా చేపట్టారు. ధర్నాను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు.