
ప్రకృతి పరిరక్షణ
పులుల సంరక్షణ..
మార్కాపురం:
పర్యావరణ సమతుల్యతలో పులులు ముఖ్య భూమిక పోషిస్తాయి. వాటిని రక్షించుకోవడం ద్వారా పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోగలం. జీవవైవిధ్యం దెబ్బతింటే మనిషి ఉనికికే ప్రమాదంగా మారుతుంది. ఈ క్రమంలో ఏటా అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే పులులు వాటి జీవనశైలిపై ప్రత్యేక కథనం.
పెద్దపులల రక్షణకు ప్రత్యేక దృష్టి
దేశంలోనే అతిపెద్దదైన నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టులో 87 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా వేశారు. నల్లమల అటవీ ప్రాంత పరిధిలో ఉండే మార్కాపురం, ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల పరిధిలో పెద్దపులుల రక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటుచేశారు. నల్లమల పరిధిలోని 4 అటవీశాఖ డివిజన్లకు ప్రస్తుతం డీఎఫ్‌ఓ స్థాయి అధికారులు ఉన్నారు. మార్కాపురం అటవీశాఖకు డిప్యూటీ డైరెక్టర్ హోదా అధికారి పర్యవేక్షిస్తున్నారు. వీరి పరిధిలో డీఆర్‌ఓలు, రేంజ్ ఆఫీసర్లు, బీటు ఆఫీసర్లు, గార్డులు వీరితో పాటు ప్రత్యేక బృందాలు పులుల సంరక్షణ కోసం పనిచేస్తున్నారు. మొత్తం 295 మంది సిబ్బంది పులుల సంరక్షణలో ఉన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో 32 బేస్‌క్యాంపులు ఏర్పాటుచేశారు. అటవీ ప్రాంతం మొత్తాన్ని 7 రేంజ్‌లుగా విభజించి 7 స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటుచేశారు.
అతిపెద్ద టైగర్ రిజర్వు
మార్కాపురం డివిజన్ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, మాచర్ల, నాగార్జునసాగర్ ప్రాంతాలున్నాయి. వీటి పరిధిలో 87 పెద్దపులులు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏకై క టైగర్ రిజర్వు అయిన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టు 5360.22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా గుర్తింపు పొందింది. ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ, సహజసిద్ధమైన గొప్ప జీవ వైవిద్యాల ప్రాంతంగా నల్లమలకు గుర్తింపు వచ్చింది. నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణానది సుమారు 200 కిలోమీటర్ల పొడవునా ఈ రిజర్వులో ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌టీఆర్ (నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫారెస్టు) లో 87 పెద్దపులులు ఉన్నాయి. పెద్దపులులు దక్షిణాది వైపు సంచరిస్తూ శేషాచలం బయోస్పియర్ రిజర్వులో తమ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు వన్యప్రాణ వేట నిరోధక శిబిరాలను ( యాంటీ పోచింగ్ క్యాంప్)ఏర్పాటు చేసి 295 మంది సిబ్బందితో పాటు అధనంగా చెంచు గిరిజనులను సంరక్షకులుగా, స్వచ్ఛ సేవకులుగా చెక్‌పోస్టులో, అటవీ ప్రాంతాల్లో నియమించారు. పులుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. శ్రీలంకామల్లేశ్వర వన్యప్రాణ అభయారణ్యం, పెంచల నరసింహ వన్యప్రాణుల అభయారణ్యం, వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం పులుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ మూడు ప్రాంతాలు సుమారు 9335.78 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి భవిష్యత్‌లో పులులు తమ ఆవాసాలను ఏర్పరుచుకునే వాతావరణానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నల్లమలలో ఇప్పటికే 32 బేస్ క్యాంపులు ఏర్పాటుచేశారు. 2022లో ఏడాది దాదాపు 73 పెద్ద పులులు ఉండగా, గత ఏడాది ఈ సంఖ్య 80కి పెరిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు 87కి చేరింది. పులుల సంరక్షణకు తీసుకునే చర్యలతో పులుల సంఖ్య పెరుగుతోంది. గత మూడేళ్లుగా అటవీ ప్రాంతంలో గడ్డి పెంపకం వల్ల పొదలు ఏర్పడ్డాయి. జింకలు, దుప్పుల సంఖ్య పెరిగింది. వీటి వలన పెద్దపులుల సంఖ్య కూడా పెరిగింది.
బేస్ క్యాంపుల ఏర్పాటు..
అటవీ ప్రాంతంలో ఉన్న టైగర్ వాచర్స్ నిరంతరం అడవిలో తిరుగుతూ పులుల సంరక్షణపై దృష్టి పెట్టి పులుల కదలికలను ట్రాక్ చేస్తారు. సీసీ కెమెరాల ద్వారా పెద్దపులుల కదలికలను పరిశీలిస్తుంటారు. పులుల సంరక్షణ కోసం బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, నారుతడికల, పాలుట్ల, ఇష్టకామేశ్వరీ, దొరబైలు, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, చినమంతనాల, రోళ్లపెంట, కొర్రపోలు, తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంప్‌లు ఉన్నాయి. ఇందులో అటవీశాఖ సిబ్బంది ఉంటారు. అడవిలోకి ఎవ్వరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇక రాత్రిపూట శ్రీశైలం వెళ్లే ప్రయాణికులను దోర్నాల చెక్‌పోస్టు వద్ద రాత్రి 9 గంటలకే నిలిపి వేస్తున్నారు. తెలంగాణ ప్రాంత నుంచి వచ్చే వాహనాలను కూడ ఈగలపెంట వద్ద 9 గంటలకు నిలిపి వేస్తున్నారు. ఇలా చేయటం వల్ల రాత్రిపూట పెద్దపులులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంది.
నల్లమలలో సంచరిస్తున్న పెద్దపులి

ప్రకృతి పరిరక్షణ