
ఉరుములు, మెరుపులతో బెంబేలు
ఒంగోలు సబర్బన్:
జిల్లాలోని తీర ప్రాంత మండలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి మొత్తం పెద్ద శబ్దాలతో ఉరుములు, మెరుపులతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ప్రధానంగా సముద్ర తీర ప్రాంత మండలాలతో పాటు వాటికి ఆనుకొని ఉండే మండలాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. కొత్తపట్నం మండలంలో 72.4 మిల్లీ మీటర్లు, చీమకుర్తి 72 మిల్లీ మీటర్లు, ఒంగోలు రూరల్ 62.6, ఒంగోలు అర్బన్ 62.6, మద్దిపాడు 48.8, నాగులుప్పలపాడు 40.6, సంతనూతలపాడు 39.8, టంగుటూరు 33.6, మర్రిపూడి 26 మి.మీ, పొదిలి, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో వర్షం కురిసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. ఒంగోలు నగరంతో పాటు పలు మండలాల్లో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. తీర ప్రాంత మండలాలలోని పలు గ్రామాల్లో కూడా ఉదయం 8 గంటలకు వరకు కూడా విద్యుత్ సరఫరా చేయలేదు. ఒంగోలు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకు తీసి 10 గంటలకు విద్యుత్‌ను ఇచ్చారు. ఒక పక్క ఉరుములు, మెరుపులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే విద్యుత్ లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
ఒంగోలు నగరం, పరిసరాల్లో పిడుగులు, కుండపోత వాన మరోపక్క విద్యుత్ కోతలతో ప్రజల అవస్థలు నగర వీధులు జలమయం