రెండు నియోజకవర్గాల ముఖ్య నాయకుల మధ్య వివాదం కొండపి టీడీపీ నేత అక్రమ దందాలో కావలి నేత జోక్యం అక్రమ దందాతో కొండపి నేతకు నెలకు రూ.25 లక్షలు కావలి నాయకుడి అనుచరుల రాకతో ఆదాయానికి గండి దీంతో అక్రమ రవాణాను పోలీసులకు పట్టించిన వైనం కేసు వద్దన్న కావలి నేత.. పెట్టించిన కొండపి నాయకుడు
సాక్షి నెట్‌వర్క్, ఒంగోలు: రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా రెండు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుల మధ్య చిచ్చుపెట్టింది. చివరకు వివాదంగా మారింది. ఆ వివరాలు... కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం కె.అగ్రహారం రేషన్ షాపు నుంచి 53 బస్తాల బియ్యాన్ని కావలి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరులు ఈ నెల 3న అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కొండపిలోని అన్ని మండలాల్లో డీలర్ల నుంచి రేషన్ బియ్యం కేజీ రూ.20 చొప్పున కొని తీసుకెళ్తున్నారు. అయితే, కొండపిలో రేషన్ బియ్యం అక్రమ దందాను మంత్రి లోకేష్‌కు సన్నిహితంగా ఉండే, నామినేటెడ్ పోస్టులోని నాయకుడు నడిపిస్తున్నారు. ఆయన అనుచరులు సింగరాయకొండ కేంద్రంగా రేషన్ మాఫియా సాగిస్తున్నారు. దీనికిగాను ఆ యువ నేతకు నెలకు రూ.25 లక్షలను ఓ రైస్ మిల్లు యజమాని అందజేస్తున్నట్లు సమాచారం. డీలర్లు కార్డుదారులకు బియ్యం బదులు నగదు ఇస్తూ భారీగా బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. డీలర్ నుంచి కిలో రూ.15– రూ.16కు కొండపి నేత అనచరులు కొంటున్నారు. 12 వేల బస్తాల రేషన్ బియ్యం నెలనెలా అక్రమంగా రవాణా అవుతోంది. అయితే, కావలి నేత అనుచరులు కేజీకి రూ.20 ఇస్తుండటంతో డీలర్లు వారివైపు మొగ్గుచూపారు. ఇది కొండపి నియోజకవర్గ నేతకు వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలా ఎందుకు జరిగింది? అని ఆయన ఆరా తీయగా... కావలి టీడీపీ నాయకుల దందా బయటపడింది. దీంతో పొన్నలూరు మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులకు ఉప్పందించారు. వారు వెళ్లి వాహనాన్ని పట్టుకున్నారు.
ఆయన పోలీసులకు పట్టించారు.. ఈయన కేసు వద్దన్నారు
తన అనుచరుల బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్టపడడంతో వెంటనే కావలి ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. కొండపి నుంచి రాష్ట్ర స్థాయి కీలక పదవిలో ఉన్న నాయకుడికి ఫోన్ చేశారు. కేసు లేకుండా తమవాళ్ల వాహనాన్ని వదిలేయాలని కోరారు. కేసులు పెడితే మీ బియ్యం లారీలు మా నియోజకవర్గం మీదుగా వెళ్లలేవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొండపి కీలక నాయకుడు.. కేసులు పెట్టవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చారు. కానీ, నామినేటెడ్ పదవిలో ఉన్న నేత కల్పించుకుని కేసులు పెట్టాలని పట్టుబట్టారు. ఈ పరిస్థితిలో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు, శ్ఙ్రీరేషన్ బియ్యం అక్రమ రవాణా సమాచారం మేరకు వెళ్లి వాహనాన్ని పట్టుకున్నాం. అందులో గోతాలు, పట్టాలే ఉన్నాయి. వాహనాన్ని స్టేషన్‌కు తరలించాంశ్రీశ్రీ అని వెల్లడించారు. కానీ, రేషన్ దందా బట్టబయలవడంతో ఎస్సై అనూక్ సోమవారం వివరణ ఇచ్చారు. ముప్పాళ్ల అడ్డరోడ్డు వద్ద తనిఖీల్లో 40 బస్తాల బియ్యాన్ని పట్టుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించామన్నారు. కేసు పెట్టామని చెప్పారు. శుక్రవారం పట్టుకున్న బియ్యానికి సోమవారం కేసు నమోదు, వాహనంలో బియ్యమే లేవని చెప్పి ఇప్పుడు 40 బియ్యం బస్తాలు పట్టుకున్నామని చెప్పడం గమనార్హం. మరోవైపు రేషన్ బియ్యం కె.అగ్రహారం నుంచి రవాణా అవుతుంటే... కనిగిరి వైపు నుంచి వస్తుండగా ముప్పాళ్ల అడ్డరోడ్డు వద్ద పట్టుకున్నామనడంతో ఏంజరిగిందో తెలిసిపోయింది. కొసమెరుపు ఏమంటే... ఆదివారం కావలి టీడీపీ నేతలు కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలంలో 80 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు పెట్టారు.
టీడీపీలో రేషన్ బియ్యం.. కయ్యం