
ప్రజల సొమ్ము ప్రైవేట్‌కు కట్టబెట్టడమే పీ3
మార్కాపురం: ప్రజల సొమ్మును ప్రైవేట్‌కు కట్టబెట్టడమే పీ3 ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్వహించాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సీపీఎం పట్టణ కార్యదర్శి డీకేఎం రఫీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ మార్కాపురం మెడికల్ కాలేజీని పీ3 విధానంలో నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అతి తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తికావడానికి అవకాశమున్న మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేట్ వారికి అప్పగించడం మంచి పద్ధతి కాదన్నారు. 66 ఏళ్ల పాటు వైద్యశాలను ప్రైవేట్ వారికి అప్పగించడమంటే వైద్య రంగాన్ని ప్రజలకు దూరం చేయడమేనన్నారు. కూటమి నాయకులు గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీని సీట్ల అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే కళాశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారని, ఇప్పుడేమో మాట మార్చి మొత్తం వైద్యకళాశాలనే కార్పొరేటర్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. కార్పొరేటర్ల ప్రయోజనం కోసమే వైద్యరంగాన్ని ప్రభుత్వ రంగంగా కాకుండా ప్రైవేట్ వారికి మేలు చేయడమే అన్నారు. అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో సరైన వైద్యం అందక అనేక మంది సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాలకు తలొగ్గి మోడీ బాటలో పయనిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తన పీ3 విధానాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వమే నిర్మించాలన్నారు. ఎకరా 1 రూపాయితో వందల ఎకరాల ప్రజల భూమిని 66 ఏళ్ల లీజుకు ఇవ్వడమంటే ప్రజల సొమ్మును ప్రైవేట్ వారికి అప్పజెప్పడం కాదా అని విమర్శించారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కార్యాలయ ఏఓ రవీంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు అందె నాసరయ్య, ఎస్‌కే ఖాశీం, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సోమయ్య, రఫీ, గుమ్మా బాలనాగయ్య, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, అమ్‌ఆద్మీపార్టీ జిల్లా అధ్యక్షుడు వి.సుదర్శన్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఇమ్రాన్, మాబూవలి, కాాశయ్య, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలి
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్