
శనగ రైతులను ఆదుకోవాలి
ఒంగోలు సబర్బన్: శనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద సోమవారం వివిధ రైతు సంఘాల నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద ఉన్న శనగ నిల్వలను క్వింటా రూ.10 వేల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే క్వింటా శనగలకు రూ.3 వేల సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల వద్ద శనగల నిల్వలు పేరుకుపోయాయని, కనీస ధరలు లేక అమ్ముకోలేకపోతున్నారన్నారు. మరో వైపు కేంద్రం దిగుమతి సుంకాలు రద్దు చేయడం దారుణమన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, టాంజానియా దేశాల నుంచి దిగుమతులు వస్తే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. పప్పుదినుసులుగా ఉపయోగించే ఉతృత్తులను దేశీయ అవసరాలకు తగినట్లుగా సాగు ఉత్పత్తులను నియంత్రించి ధరలు నిలకడగా ఉండేలా రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిగుమతి సుంకాలు పెంచి దిగుమతులను అడ్డుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. వివిధ రైతు సంఘాల నేతలు జె.జయంత్ బాబు, కె.వీరారెడ్డి, చుంచు శేషయ్య, పరిటాల కోటేశ్వరరావు, జి.నాగేశ్వరరావు, బెజవాడ శ్రీనివాసు పాల్గొన్నారు.
క్వింటా రూ.10 వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి
కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన