మార్కాపురం: మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా నాయకుడు దగ్గుబాటి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి అనంతరం వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో వేలాది ఎకరాల్లో రైతులు విరివిగా పత్తిని సాగు చేశారని, గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో గ్రామాల్లో ప్రైవేట్ పత్తి వ్యాపారులు ప్రవేశించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. మార్కాపురం మార్కెట్‌యార్డులో సీసీఐ ఆధ్వర్యంలో వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా రూ.8,110లుగా ప్రకటించినా ఒక్క క్వింటా కూడా రైతుల నుంచి కొనుగోలు చేయలేదన్నారు. ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను కాపాడాలని కోరారు. గ్రామాల్లో క్వింటా పత్తిని రూ.5,500 నుంచి 6,500 మధ్యనే కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. రైతు సంఘం నాయకులు జి రాజశేఖర్‌రెడ్డి, ఏరువ పాపిరెడ్డి, డి.తిరుపతిరెడ్డి, రైతులు లక్ష్మినాయక్, కాశిరెడ్డి, వెంకట రమణ, నాగేశ్వరరావు, ఓర్సు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద
రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన