
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం
● ఎస్పీ హర్షవర్థన్‌రాజు
ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల వేదికకు ఎంతో నమ్మకంతో వస్తున్న బాధితుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి 66 ఫిర్యాదులు వచ్చాయి. బాఽధితులతో ఎస్పీ నేరుగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్య పూర్వాపరాలను అడిగి తెలసుకొని ఆయా పోలీసుస్టేషన్ అధికారులతో ఫోన్ చేసి మాట్లాడారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చేవారిలో వృద్ధులు, నడవలేనిస్థితిలో ఉన్న మహిళలు వస్తుంటారని, అలాంటి వారి సమస్యలను సావదానంగా విని వారికి సత్వర న్యాయం అందిస్తామన్న భరోసా ఇవ్వాలని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు స్థానిక పోలీసుస్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్లలో ఫిర్యాదులను అందజేయాలని చెప్పారు. కార్యక్రమంలో పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ దుర్గా ప్రసాద్, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, పామూరు సీఐ బీమానాయక్, కంభం సీఐ మల్లికార్జునరావు, మీకోసం వేదిక ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.