
దోపిడీ హై..
పరిహారంలో
● పొదిలి–తూర్పు గంగవరం హై టెన్షన్ టవర్ల నిర్మాణంలో మాయాజాలం ● రైతులకు పరిహారం చెల్లింపులో నిబంధనలు బేఖాతరు ● రైతులను మోసగించిన ట్రాన్స్ కో, రెవెన్యూ అధికారులు ● హై టెన్షన్ విద్యుత్ లైన్ వెంట 144 ఎకరాల్లో నష్టపోయిన రైతుల గగ్గోలు ● రైతుల సొమ్ము మింగేసిన అధికారులు, కాంట్రాక్టర్లు
హైటెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణంలో నష్టపోయే రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ట్రాన్స్‌కో, రెవెన్యూ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఐదు రకాల పరిహారాలు ఇవ్వాల్సి ఉంటే లబ్ధిదారులకు అరకొరగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. పరిహారం చెల్లింపులో తమకు జరిగిన అన్యాయంపై కొందరు రైతులు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేయడంతో చివరకు ట్రాన్స్‌కో అధికారులు రైతులతో చర్చలకు దిగారు.
పరిహారాల్లో లోపం జరిగింది నిజమే..
రైతులకు నష్ట పరిహారం విషయంలో రెవెన్యూ అధికారులతో, రైతులతో చర్చలు జరుపుతున్నాం. ఇటీవల ఒంగోలు ఇన్‌చార్జ్ ఆర్‌డీఓ సమక్షంలో ట్రాన్స్ కో అధికారులు, రెవెన్యూ అధికారులు, రైతులతో చర్చించాం. రైతులకు పరిహారాల్లో కొంత లోపం జరిగిన మాట వాస్తవమే. నేను బాధ్యతలు తీసుకోకముందు జరిగిన పరిస్థితులు కొన్ని ఉండవచ్చు. అయితే నేను వచ్చిన తరువాత రైతులతో నేరుగా మాట్లాడుతున్నాను. ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇద్దరు కాంట్రాక్టర్లు మారారు. రైతులకు న్యాయం చేస్తాం.
– ఏ.కృష్ణారెడ్డి, ట్రాన్స్ కో ఈఈ
పంట పొలాల్లో వేసిన విద్యుత్ టవర్లు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
విద్యుత్ కాంట్రాక్టుల విషయంలో ట్రాన్స్ కో అధికారుల దోపిడీ అంతా ఇంతా కాదు. పెద్ద పెద్ద టవర్లు...హైటెన్షన్ విద్యుత్ లైన్లు పొలాల్లో గుండా పోతుంటాయి. కానీ రైతులకు రావాల్సిన పరిహారాలు ఇవ్వకుండానే అధికారులు, అధికార పార్టీ నాయకులు తినేస్తున్నారు. రైతులకు తెలియక ప్రభుత్వం విద్యుత్ లైన్లు వేస్తుంది మనమేమీ చేయలేమని వదిలేస్తున్నారు. అదే ట్రాన్స్ కో అధికారులకు వరంగా మారి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే...
పొదిలి–తూర్పు గంగవరం హైటెన్షన్ విద్యుత్ లైను నిర్మాణాన్ని ట్రాన్స్ కో అధికారులు చేపట్టారు. ఏడు సంవత్సరాల నుంచి పనులు చేపడుతున్నా ఇప్పటికీ విద్యుత్ లైన్ నిర్మాణం పూర్తి కాలేదు. ఇద్దరు కాంట్రాక్టర్లు మారారు. మొత్తం రూ.50 కోట్ల నిర్మాణ పనులు. మొదటి కాంట్రాక్టర్ రూ.12 కోట్లు పనులు చేశామని పూర్తిగా పనులు చేయకుండానే చేతులెత్తేశాడు. ఆ తరువాత మరో కాంట్రాక్టర్ రూ.15 కోట్ల వ్యయంతో చేస్తామని పనులు ప్రారంభించాడు. కానీ అదీ కూడా అంతంత మాత్రమే.
రైతులకు శఠగోపం...
పొదిలి నుంచి తూర్పు గంగవరం వరకు హై టెన్షన్ విద్యుత్ లైన్ నిర్మాణంతో పాటు పెద్ద పెద్ద విద్యుత్ టవర్లు కూడా నిర్మించాల్సి ఉంది. అందుకు సంబంధించి రైతులకు ఐదు రకాలుగా పరిహారాలు చెల్లించాలి. రైతులకు చెల్లించకుండానే చెల్లించామని రూ.10 కోట్లు ఇద్దరు కాంట్రాక్టర్లు, ట్రాన్స్ కో అధికారులు తినేశారన్న ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. పొదిలి నుంచి తూర్పు గంగవరం వరకూ వెళ్లాల్సిన హైటెన్షన్ విద్యుత్ లైను, టవర్ల నిర్మాణంలో 144 ఎకరాలు పొడవునా రైతులు నష్ట పోతున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.6 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో రైతుకు పది సెంట్ల మొదలుకొని 30 సెంట్ల వరకు పొలాన్ని కోల్పోతున్నాడు. అంటే మొత్తంగా విద్యుత్ లైన్ కింద మాత్రమే కోల్పోయే రైతులు 144 ఎకరాలు లెక్కల ప్రకారం తేలుతుంది. ఈ 144 ఎకరాలు లెక్కేస్తే మొత్తం రూ.8 కోట్లు అవుతుంది. మొత్తంగా 73 టవర్లు నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ నిర్మాణం, స్థలం ఖరీదు లెక్కేస్తే ఒక్కో టవర్ ఏరియాకు రూ.1.20 లక్షలు రైతులకు ఇవ్వాల్సి ఉంది. మొత్తం కలిపి రూ.87.60 లక్షలు రైతులకు పరిహారంగా ఇవ్వాలి. దానికి తోడు పంట నష్టం మొత్తం 500 ఎకరాల్లో జరుగుతుంది. పంట నష్టం కింద ప్రభుత్వం విడుదల చేసిన జీఓల ప్రకారం ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంది. అంటే మొత్తం రూ.2.50 కోట్లు ఇవ్వాలి. మొత్తంగా 73 టవర్లు నిర్మించాల్సి ఉంటే వాటి నిర్మాణ సమయంలో చుట్టూ 50 మీటర్లు పొలాన్ని వాడుకుంటారు. పంట ఉన్నా ధ్వంసం చేసిమరీ వాడుకున్నారు. ఆ విధంగా చూస్తే 73 టవర్లకు ఒక్కోటవర్ కింద రైతుకు మరో రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంది. అన్నీ కలిపి దాదాపు రూ.12 కోట్ల వరకు ఉంటుంది. తమకు నిబంధనల మేరకు పరిహారం అందలేదని పది మంది రైతులు నెల రోజుల క్రితం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమాల విషయం వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు మరికొంత మంది రైతులకు కూడా పూర్తిస్థాయిలో పరిహారం దక్కలేదని తెలుస్తోంది.
అక్రమాల వెనుక రెవెన్యూ అధికారుల పాత్ర...
సాధారణంగా ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి పరిశ్రమలకై నా, విద్యుత్ లైన్లకై నా భూములు కావాలంటే రెవెన్యూ అధికారులు సర్వే చేయాల్సి ఉంది. రైతులను గుర్తించాలి. వాళ్లకు నోటీసులు ఇవ్వాలి. ఆ తరువాత వాళ్ల వద్ద నుంచి ఆధార్ కార్డులు, వాళ్ల బ్యాంకు అకౌంట్లు తీసుకోవాలి. రైతులు ఇష్ట పడితేనే వాళ్లకు రావాల్సిన ఐదు రకాల నష్ట పరిహారాలు వాళ్ల బ్యాంకు అకౌంట్లలో పరిహారం జమ చేయాలి. అయితే ట్రాన్స్ కో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క 73 టవర్లు నిర్మాణంలో ఉన్న రైతులకు మాత్రమే రూ.30 వేల నుంచి రూ.65 వేల వరకూ వేశారు. అంటే ఇక్కడ కూడా నిబంధనలు పాటించలేదు. ట్రాన్స్ కో, రెవెన్యూ అధికారులు కూడబలుక్కొని రైతులకు చెందాల్సిన సొమ్ముకు వాటాలు వేసుకున్నారు. అసలు ఈ విద్యుత్ లైన్ కింద ఎంత మంది రైతులు ఉన్నారు. వాళ్లకు ఎంతమేర నష్ట పరిహారం ఇచ్చామని ట్రాన్స్ కో అధికారులు కూడా లెక్కలు బయట పెట్టడం లేదంటే రైతుల సొమ్ము ఎంత దోచుకున్నారో అర్థమవుతోంది.

దోపిడీ హై..