
రెచ్చిపోతున్న మట్టి దొంగలు
యథేచ్ఛగా పచ్చదండు అక్రమ మట్టి తవ్వకాలు చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఆగని తవ్వకాలు
పామూరు: ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు, చెరువులను వదలకుండా కూటమి నేతలు యథేచ్ఛగా మట్టిని జేసీబీలతో తవ్వించి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. మండలంలోని అనుములకొండ సమీపంలో చింతలపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన పొలాల్లో కొన్ని రోజులుగా జేసీబీ, ట్రాక్టర్లతో కూటమి నాయకులు పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేపట్టి పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో నూతనంగా వేస్తున్న లేఅవుట్‌ల రోడ్లకు, నూతన భవనాల నిర్మాణాల పునాదుల కోసం తరలిస్తున్నారు. ఈప్రాంతంలో ఉన్న మరసమట్టి మేలురకం కావడంతో ట్రాక్టర్ రూ.650 నుంచి రూ.800 దాకా పలుకుతోంది. ఇంత జరుగుతున్నా అటు పంచాయతీ కార్యదర్శులుగానీ, వీఆర్‌ఓలు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
అదేవిధంగా 167బి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దూబగుంట్ల చెరువులో ఇటీవల కూటమి నాయకులు డోజర్, జేసీబీలను పెట్టి మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారి పక్కన ఇలా తవ్వకాలు చేపడుతున్నారంటే అధికార బలంతోనే కూటమి నాయకులు అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
చెరువులు, ప్రభుత్వ భూముల్లో ఆగని తవ్వకాలు:
ఇటీవల మండలంలోని దూబగుంట్ల చెరువులో మట్టి తవ్వకాలను అధికారులు అడ్డుకుని జేసీబీ, ట్రాక్టర్ యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా దూబగుంట్లలో తవ్వకాలు ఆపేసి మరో ప్రాంతంలో తవ్వకాలకు తెరలేపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేఅవుట్‌లలో చదునుకోసం, రోడ్ల నిర్మాణానికి వందల సంఖ్యలో ట్రాక్టర్ల మట్టి అవసరమవుతుండగా దీనిని అక్రమంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

రెచ్చిపోతున్న మట్టి దొంగలు