
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ సిగ్గుచేటు
ఒంగోలు టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సిగ్గుచేటని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ తీవ్రంగా విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగరంలోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ హాలులో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన 17 మెడికల్ కళాశాలలు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం నిర్మాణాల కోసం ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవడం అభ్యంతరకరమన్నారు. పీపీపీ పేరుతో సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ద్వారా విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ వినోద్ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన యూనివర్శిటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీలను నిర్మించలేదని, మార్కాపురానికి కేటాయించిన వైద్య కళాశాలను నిర్మాణం పూర్తిచేయకుండా పీపీపీ పేరుతో సొంత వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్కాపురం వైద్య కళాశాలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని సీపీఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడం భావ్యం కాదని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బేగ్ విమర్శించారు. కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు మోహన్, సీపీఐ నాయకులు ఎంఏ సాలార్, ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు కార్తీక్, ప్రగతిశీల యువజన సంఘం నాయకులు సుధాకర్, పీడీఎస్‌యూ నాయకులు సచిన్, ప్రేమ్, సామాజిక కార్యకర్త శివరామ్ తదితరులు పాల్గొన్నారు.