
పులి సంచారంపై అటవీ అధికారుల విచారణ
వెలిగండ్ల (కనిగిరి రూరల్): నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం నాగిరెడ్డిపల్లి, వెదుళ్ల చెరువు, గుడిపాటి పల్లి బీట్ అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారం రోజుల క్రితం మరపగుంట్ల పొలాల్లో పులి తిరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు ఆప్రాంతంలో పాద ముద్రల నమూనాలను సేకరించి.. అవి పెద్దపులి ఆనవాళ్లు కాదని తెలిపారు. చిరుత పులి, లేదా జంగుపిల్లి పాద ముద్రలు అయి ఉండవచ్చునని నిర్ధారించారు. తాజాగా శనివారం రాత్రి ఇమ్మడిచెరువు, రాళ్లపల్లి (శివారు ప్రాంతాల్లోని) గ్రామాల్లోని పొలాల్లోకి రాత్రి పది గంటల సమయంలో పులి రోడ్డు దాటుతుండటాన్ని బైక్ పై వెళ్తున్న జీ వెంకటయ్య చూసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈమేరకు ఫారెస్ట్ రేంజర్ తుమ్మా ఉమా మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు గుడిపాటిపల్లి, సీఎస్‌పురం బీట్ సెక్షన్ అధికారులు దొరసాని, నవీన్, నాయక్‌లు ఆయా ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. వన్యప్రాణుల ఆనవాళ్లు, పాద ముద్రల నమూనాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి తుమ్మ ఉమా మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ కనిగిరి ఫారెస్ట్ ప్రాంతంలో టైగర్ పెద్ద పులులు లేవని తెలిపారు. చిరుత లేదా, జంగుపల్లి ఆనవాళ్లుగా తెలుస్తోందన్నారు. పొలాల్లో సంచరిస్తున్న వన్యప్రాణులను నిర్ధారించేందుకు నాగిరెడ్డిపల్లి, వెదుళ్ల చెరువు బీట్ ప్రాంతాల్లో ‘కెమెరా ట్రాప్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొండ కింద గ్రామాల ప్రజలు రాత్రి వేళ ఆరు బయట పడుకోవద్దని, పొలాలకు, పశువుల మేతకు ఒంటరిగా అడవి ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు.