
సీనరేజి వసూలును ప్రైవేటుకు అప్పగించొద్దు
ఎడ్జ్ కటింగ్ యూనిట్ల యూనియన్ అధ్యక్షుడు బూర్సు వెంకట కొండయ్య
చీమకుర్తి రూరల్: గ్రానైట్ సీనరేజి వసూలు బాధ్యతను ప్రైవేటు సంస్థ అయిన ఏఎంఆర్ కు కేటాయించడాన్ని రద్దు చేయాలని ఎడ్జ్ కటింగ్ యూనిట్ల యూనియన్ అధ్యక్షుడు బూర్సు వెంకట కొండయ్య డిమాండ్ చేశారు. రామతీర్థంలోని వీటీసీ కార్యాలయంలో ఎడ్జ్ కటింగ్ యూనిట్లు నడుపుతున్న యజమానులు ఆదివారం సమావేశమయ్యారు. గ్రానైట్ పరిశ్రమల యజమానుల సమ్మెకు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి ఫ్యాక్టరీలు మూతపడే స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు గ్రానైట్ పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఉండాలే కానీ, గ్రానైట్ పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకంగా మార్చేలా ఉండకూడదన్నారు. ఎడ్జ్ కటింగ్ వంటి చిన్న కుటీర పరిశ్రమలపై ఆధారపడి సుమారు వెయ్యి నుంచి 2 వేల మంది బతుకుతున్నారన్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే తమ జీవితాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రానైట్ పరిశ్రమలను సంక్షోభం నుంచి బయటపడేలా రాయితీలు ఇవ్వాలని, కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎడ్జ్ కటింగ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఐనీడి బుల్లియ్య, చంద్ర, శివ పాల్గొన్నారు.